‘పోలవరం నిర్వాసితులకు భరోసా’

29 Aug, 2019 11:39 IST|Sakshi
పెద్దభీంపల్లిలో గృహాలను పరిశీలించేందుకు వెళుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు, తదితరులు 

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

రంపచోడవరం(తూర్పుగోదావరి) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భరోసా లభించింది. ఏజెన్సీ, మైదాన ప్రాంతంలోని పునరావాస కాలనీల్లో రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పర్యటించారు. ఎంతోకాలంగా అనేక సమస్యలతో సతమతమవుతున్న నిర్వాసితులు మంత్రి పర్యటనతో సంతృప్తి వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల్లో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు)తో కలిసి పర్యటించారు.

గోకవరం మండలం కృష్ణునిపాలెం, దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్, ఇందుకూరు, పెద్దబియ్యంపల్లి గ్రామాల్లో పునరావాస కాలనీలు మంత్రి సందర్శించారు. కృష్ణునిపాలెంలో గిరిజనేతరులకు నిర్మించిన కాలనీని సందర్శించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు తొమ్మిది ఫిల్లర్స్‌తో నిర్మించిన మోడల్‌ గృహాన్ని పరిశీలించారు. పెద్దబియ్యంపల్లి వద్ద కొండమొదలు నిర్వాసితులు తమకు భూమికి భూమి ఇవ్వలేదని, చెట్లకు డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో మంత్రి భూమికి భూమి ఇవ్వకుండా నిర్వాసితులకు ఎలా ఇళ్లు నిర్మించారని అధికారులను ప్రశ్నించారు. తక్షణం సేకరించిన భూమిని వారికి ఇచ్చే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

నిర్వాసితులకు అండగా ఉండాలి
అనంతరం ఐటీడీఏలో జరిగినలో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు నిర్వాసితులకు అండగా ఉండి పునరావాసాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు మెరుగైన పునరావాసం, నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంలో నాణ్యతపై థర్డ్‌ పార్టీ ఇంజినీర్లతో  తనిఖీలు చేపడతామన్నారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా కాఫర్‌డ్యామ్‌ నిర్మించడం వల్ల రెవెన్యూ ఇరిగేషన్‌ అధికారులు వరద పరిస్థితిని అంచనా వేయలేకపోయారన్నారు. వచ్చే ఏడాది మార్చి 31నాటికి  నూరుశాతం ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తి చేయాలన్నారు. నిర్వాసితుల గృహ నిర్మాణం, రంపచోడవరం ప్రాంతంలో అమలు జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షించారు. 

గిరిజనేతరులకు ఇళ్లు మంజూరు చేయాలి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు  అనంత ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌ బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఏజెన్సీలో గృహనిర్మాణ పథకం నిధుల కేటాయింపును పెంచాలని కోరారు.  పేద గిరిజనేతరులకు గృహలను మంజూరు  చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహ నిర్మాణం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 

అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం
ఏజెన్సీ పర్యటనలో భాగంగా గృహనిర్మాణశాఖ  ఎండీ కాంతిలాల్‌ దండే ఐటీడీఏలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.  ఏజెన్సీలో  24,620 గృహాలు మంజూరు కాగా 15 వేల ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు. ఇంకా  7,650 గృహాలు పూర్తి కాలేదన్నారు. వీటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.  వచ్చే నెల సెప్టెంబర్‌ నుంచి బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, ఆర్డీఓ బి.శ్రీనివాసరావు, ఏఎస్పీ వకుళ్‌ జిందాల్, పీడీ జీవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

అదనపు నిధులు ఇస్తాం
రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ నిర్వాసితులకు త్వరితిగతిని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏజెన్సీలో 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఒకటి, రెండు, మూడు విడతల్లో మంజూరు చేసిన సుమారు నాలుగువేల ఇళ్ల నిర్మాణాలు అసంతృప్తిగా నిలిచిపోయాయన్నారు. వాటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ  ఇందిరమ్మ పథకంలో నిలిచిపోయిన ఇళ్లు పూర్తి చేసేందుకు అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇతర నిధులు నుంచి కూడా కొంత మొత్తం కేటాయిస్తే గిరిజనులు మంచి ఇళ్లు నిర్మించుకుంటారని తెలిపారు. ఇందుకోసం నిలిచిన గృహాల జాబితా సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని గృహ నిర్మాణశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా