ఆహార భద్రతపై మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష

16 Aug, 2013 21:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార భద్రత అమలు చేసేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని  పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. శుక్రవారం ఆయన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. ఆహార భద్రత చట్టం పార్లమెంటులో ఆమోదించిన తర్వాత రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలు - ఏర్పడే సమస్యలు - పరిష్కారానికి చేయాల్సిన పనులపై ఆయన అధికారులతో మాట్లాడారు. ఆహార భద్రత చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో అదనంగా కావాల్సిన బియ్యాన్ని ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు.

 

ఆహార భద్రతకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితిపై  కేంద్ర ఆహర శాఖ మంత్రి థామస్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని కూలంకుషంగా వివరించేందుకు వీలుగా ఆయన రాష్ట్ర అధికారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపంపిణీ కోసం నెలకు సగటున 3.25 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తుండగా ఆహార భద్రత చట్టం అమలు చేస్తే నాలుగు లక్షల టన్నులు అవసరమవుతాయని అధికారులు వివరించారు.
 

మరిన్ని వార్తలు