‘అవి కూడా లాక్‌డౌన్‌ చేయాలి’

27 Mar, 2020 15:34 IST|Sakshi

సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి): కరోనా వ్యాధి నివారణకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి తానేటి వనిత కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం వల్ల  ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయన్నారు. ఇతర దేశాల్లో కరోనా  మహమ్మారి వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ పరిస్థితి మన దేశానికి వస్తే తట్టుకోగలమా? అని ఆమె ప్రశ్నించారు. అందువల్ల ప్రజలు ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణ పాటించి వ్యాధిని వ్యాప్తి చెందకుండా అరికట్టాలని కోరారు. 

కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో ఆమె శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరు పట్టణంలో పర్యటించి దుకాణాలు తెరిచిన యజమానులకు నచ్చజెప్పారు. పట్టణంలో అమలవుతున్న శానిటేషన్‌తో పాటు  వివిధ అంశాలను పరిశీలించారు. అనంతరం కొవ్వూరు ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను పరిశీలించి హైదరాబాద్ నుండి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థులను పరామర్శించారు.  కరోనా వ్యాధి నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ లాక్‌డౌన్ చేయాలని ఆదేశించాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ పిల్లలుంటారు. వాళ్లు బయటకు రావడం మంచిది కాదు. అందుకే  పిల్లల పౌష్టికాహారాన్ని డోర్ డెలివరీ చేస్తాం. ఇంటింటికీ పాలు, పౌష్టికాహారం అంగన్‌వాడీ రేషన్ అందిస్తాం. రాష్ట్రంలో ఉన్న 11 లక్షల 20 వేలకు పైగా ప్రీస్కూల్ పిల్లలకు వీటిని అందిస్తాం. 18 లక్షలకు పైగా ఏడు నుంచి 3 ఏళ్లలోపు పిల్లలున్నారు. వారికి కూడా బాలమృతం, సంజీవనిని ఇంటికే అందిస్తాం. గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే రేషన్ కూడా డోర్ డెలివరీ చేస్తాం. రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు ఈ పౌష్టికాహారాన్ని డోర్ డెలివరీ చేస్తాం. వికలాంగులకు, వృద్ధులకు ఫింఛన్లను ఇంటికి తీసుకెళ్లి అందిస్తాం. అనాథల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. శిశుగృహాల్లో ఉన్న అనాథలను జాగ్రత్తగా చూసుకుంటున్నాం. బయట ఉండే అనాథల కోసం కళ్యాణమండపాల్లో షెల్టర్లు పెట్టి ఆహారం అందిస్తాం’ అని ఆమె పేర్కొన్నారు.

(చదవండి: ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా