పప్పుచారు.. ఉప్పు చేప.. ఓ మంత్రి!

14 Aug, 2014 14:21 IST|Sakshi
పప్పుచారు.. ఉప్పు చేప.. ఓ మంత్రి!

గోదావరి జిల్లాల్లో పప్పుచారు - ఉప్పుచేప కాంబినేషన్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ ఖర్చులు భరించలేని వాళ్లు, వ్యవసాయ కూలిపనులకు వెళ్లేవాళ్లు కాస్త రుచికరమైన ఆహారం తీసుకోవాలంటే.. ఎక్కువగా ఈ కాంబినేషన్నే ఇష్టపడుతుంటారు. అందరికీ అందుబాటులో ఉండే మాంసాహారం కావడంతో అన్ని తరగతుల వాళ్లు కూడా దీన్ని ఇష్టపడుతుంటారు. ఉప్పు చేపలు నిల్వ ఉండే పదార్థం కావడంతో ఏడాది పొడవునా ఇంట్లో ఉంచుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారు చేసుకుని దాంట్లోకి దీన్ని నంజుకుని తింటారు.

స్వతహాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చిన సందర్భంగా తొలిసారి ఈ పప్పు చారు - ఉప్పు చేప కాంబినేషన్ రుచి చూశారు. అద్భుతః అంటూ ఇష్టపడ్డారు. మరికొంత కావాలంటూ అడిగి తీసుకుని మరీ తిన్నారు.

పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మల్యే అనంతలక్ష్మి, రూరల్ ఎంపీపీ పుల్లా సుధాచంద.. వీళ్లంతా వ్యవసాయ కూలీలతో కలిసి కళ్లంలోకి దిగి నాట్లు వేశారు. కలెక్టర్ సహా అందరికీ మంత్రి రఘునాథ రెడ్డే తన చేత్తో నారు అందించారు. ఆ తర్వాత కూలీలు తెచ్చుకున్న అల్పాహారాన్ని మంత్రి తీసుకుని తాను తింటూ వాళ్లకు కూడా తినిపించారు. తలపాగా చుట్టుకుని కాసేపు ఎడ్లబండి నడిపించారు. తర్వాత కూలీలతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు