రేషన్ డీలర్లకు మంత్రి భరోసా

23 May, 2015 04:30 IST|Sakshi

 అనంతపురం అర్బన్ : ఆందోళనలు విరమించి ప్రజ లకు ఇబ్బంది కలగకుండా సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, మీకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రేషన్ డీలర్లకు భరోసా ఇచ్చారని రేషన్ డీలర్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. డీలర్ల ఆందోళనపై స్పందించిన మంత్రి సునీత వారితో చర్చించేందుకు నాయకులు కొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. 

జిల్లా అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి, మరికొందరు నాయకులు హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి తమ డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని, డిమాండ్ల విషయమై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలిస్తున్నారని, వచ్చే మంత్రివర్గ సమావేశంలో మీకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. క్వింటాళ్లుపై రూ. 87  కమీషన్, 100 శాతం తూకాలతో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌక డిపో కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా, ఒక్కొక్క డీలర్లకు ప్రతి నెలా రూ. 10 వేలు  ఆదాయం కల్పించాలని, తదితర డిమాండ్లపై  డీలర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు