మంత్రిగారూ...వాళ్లొద్దండీ

28 Sep, 2014 04:07 IST|Sakshi

‘మంత్రిగారూ ! ఆ అధికారి ఎన్నికల్లో  టీడీపీకి  సహకరించలేదు. మరో ఆయన మేం చెప్పినా బొత్తిగా పట్టించుకోవడం లేదు..సీఐలతో కూడా బాగా ఇబ్బందిగా ఉంది. వీరందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సిందే! వారి స్థానంలో మనకు అనుకూలంగా ఉన్న వారిని తీసుకుందాం! ఇందా జాబితా!’ - ఇటీవల మంత్రి  బొజ్జలతో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలివి.
 
సాక్షి, చిత్తూరు : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం...రానున్న ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలకు లాభం జరగాలన్నా... తాము చెప్పిట్లుగా పనులు జరగాలన్నా...తాము ఏం చెబితే ఆ మాటకు ‘జీహుజూర్...!’ అనే అధికారులు కావాలి. చెప్పి న ప్రతిపనికీ ‘రూల్స్ అండ్ రెగ్యులేషన్స్’ అని తమ మాట వినని అధికారులు వద్దని టీడీపీ నేతలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి స్పష్టం చేశారు. ప్రస్తుతం బదిలీపై నిషే ధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు అక్టోబర్ 10వ తేదీ వరకూ అమలులో ఉంటాయి. ఆపై నిషేధం తిరిగి అమల్లోకి రానుంది.

దీంతో పుణ్యకాలం ముగిసేలోపు తమ దారికిరాని అధికారులపై బదిలీ వేటువేసి, అనుకూలురైన అధికారులను రప్పించుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా అధికారులతో పాటు జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఏ అధికారి తమకు అవసరం లేదో వారి జాబితాను సిద్ధంచేసి, ఈ నెల 25న చిత్తూరుకు వచ్చిన అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సమర్పించారు.

ఈ జాబితాలో డీఈవో ప్రతాప్‌రెడ్డి, డీటీసీ బసిరెడ్డి, చిత్తూరు ఆర్డీవో పెంచలకిషోర్‌తోపాటు మరికొందరి అధికారుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు సీఐలు రాజశేఖర్, రవిమనోహర్, అల్లాబక్ష్ స్థానంలో కూడా కొత్తవారిని నియమించాలని సూచించినట్లు సమాచారం. అలాగే చిత్తూరు డీఎస్పీ కమలాకర్‌రెడ్డి బదిలీ తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులునాయుడు నియమించాలని కూడా వారు తెలిపినట్లు తెలుస్తోంది. ఇదేక్రమంలో  జిల్లా వ్యాప్తంగా డీఎస్పీలు, సీఐల జాబితాను సిద్ధంచేసి మంత్రికి అందించారు.
 
వైఎస్సార్‌సీపీ ఎంపీపీలున్నచోట ఎంపీడీవోల నియామకంపై ప్రత్యేక దృష్టి

జిల్లా వ్యాప్తంగా 65 మండలాల్లోని ఎంపీడీవోల్లో ఎవరు తమకు అవసరం, ఎవరు అవసరం లేదనే జాబితాను కూడా టీడీపీ నేతలు మంత్రికి అందించారు. ముఖ్యంగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 22 చోట్ల ఎంపీడీవోల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మండలాల్లో టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుకునే ఎంపీడీవోలను నియమించేలా 22 మందితో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తహశీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించాలని సూచించినట్లు తెలిసింది.
 
కమిషనర్ బదిలీపై మేయర్ గట్టి పట్టు

చిత్తూరు కమిషనర్ రాజేంద్రప్రసాద్‌ను కచ్చితంగా బదిలీ చేయాలని మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త గట్టిగా పట్టుపట్టారు. ప్రస్తుతం వీరు ఉప్పనిప్పుగా కార్పొరేషన్‌లో కొనసాగుతున్నారు. దీంతో ఆ స్థానంలో కడప కమిషనర్ ఓబులేసుతో పాటు హైదరాబాద్ డీఎం ఆఫీసులో పనిచేస్తున్న ఈశ్వరయ్యలో ఒకరిని రప్పించుకునేందుకు మేయర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సయోధ్యలేని చోట పనిచేయడం కంటే బదిలీనే మేలనే యోచనలో కమిషనర్ ఉన్నారు.
 
జెడ్పీ సీఈవో బదిలీపై వీడని పీటముడి

జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి బదిలీపై ఇంకా సందిగ్ధత వీడలేదు. జెడ్పీ పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో సీఈవో బదిలీ ఇక అనివార్యమే అని అంతా భావించారు. అయితే తర్వాత ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం టీడీపీలోని ఓ వర్గం సీఈవోను బదిలీ చేయాలని ప్రయత్నిస్తుంటే, జెడ్పీ చైర్మన్, ఆమె భర్త చంద్రప్రకాశ్ మాత్రం సీఈవోకు అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది. దీంతో సీఈవో బదిలీ గండం నుంచి బయటపడ్డట్లే!
 

మరిన్ని వార్తలు