సంక్షేమం, అభివృద్ధే అజెండా:మంత్రి వెల్లంపల్లి

31 Dec, 2019 11:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలోని వివిధ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు విద్యాధరపురంలో స్టేడియం పేరుతో అట్టహాసంగా చంద్రబాబు శంకుస్థాపన చేశారని, అది కేవలం శిలాఫలకానికే పరిమితం అయ్యిందని మండిపడ్డారు. నామ్స్‌ నిధులు వస్తాయని ప్రజలను మభ్యపెట్టారన్నారు. జాతీయస్థాయి స్టేడియం కడతామని చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలు చేశారని ధ్వజమెత్తారు. రాజధాని తరహాలో అన్ని శంకుస్థాపనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎన్నికల ముందు హడావుడి పనులకు శంకుస్థాపనలు చేసి ఓట్లు దోచుకోవాలన్న దురుద్దేశం  తమకు లేదన్నారు. మున్సిపల్‌, స్పోర్ట్‌ అథారిటీ అధికారులతో చర్చలు జరుపుతున్నామని.. మినీ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పక్కా ప్రణాళికతో స్టేడియం పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దోబిఖానా ను సైతం అభివృద్ధి చేస్తామన్నారు. చేపల మార్కెట్‌ భవనాలు ఆధునీకరణ చేపడతామని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

దేవాదాయ శాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మంత్రి
‘ఏపీ దేవాదాయ శాఖ- 2020 క్యాలెండర్‌’ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 ముఖ్య దేవాలయాలను క్యాలెండర్ లో ముద్రించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాదాయ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దేవాలయాల భూములు పరిరక్షణకు చర్యలు చేపట్టామని చెప్పారు. అన్యమత ప్రచారమంటూ కొన్ని పార్టీలు ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం పై శాసనమండలిలో లోకేష్‌కు సవాల్ విసిరితే..ఆయన పారిపోయారని ఎద్దేవా చేశారు. గూగుల్లో జరిగే తప్పులను ప్రభుత్వంపై నెడుతున్నారని నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం ఏకులానికో, మతానికో చెందినది కాదని, పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో  దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు