‘దసరా ఉత్సవాల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది’

9 Sep, 2019 09:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ : దసరా రాష్ట్ర పండుగ కాబట్టి గత టీడీపీ ప్రభుత్వంలా కాకుండా దసరా ఉత్సవాలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం దసరా ఏర్పాట్ల పనులను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, జాయింట్‌ కలెక్టర్‌ మాధవిలత పర్యవేక్షించారు. వినాయకుడి గుడి వద్ద నుంచి కొండ పైభాగం వరకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా.

దసరా ఏర్పాట్లను ఈ నెల 25 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. కేశఖండనశాల ఏర్పాటుపై అధికారులతో చర్చించాను. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాము. దసరా ఉత్సవాలకు ఫ్లై ఓవర్ పనులు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతో పరికరాలను తొలగించాలని ఆదేశించా’’మని తెలిపారు.

మరిన్ని వార్తలు