'పూలే ఆలోచనలను ఆచరణలో చూపింది వైఎస్‌ జగన్‌'

11 Apr, 2020 13:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఉన్న పూలే విగ్రహానికి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పోరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'పూలే లాంటి మహనీయుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. పూలే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి' అని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ.. 'పూలే ఆశయాలను ఆయన చూపిన బాటలోనే బలహీన వర్గాల కోసం అభినవ పూలేగా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకువెళ్లాలన్న పూలే ఆలోచనలను ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్‌ జగన్‌. నామినేటేడ్‌ పోస్టుల్లో, వర్క్స్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రిజర్వేషన్లు.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ తెచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌' అంటూ కొనియాడారు. చదవండి: జ్యోతిరావు పూలేకి సీఎం వైఎస్ జగన్ నివాళి

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వానికి పూలే ఆదర్శం. ఆయన లక్ష్యాలు, సిద్ధాంతాలు మరవలేని. మహిళలకు విద్యావకాశాలు, వయోజన విద‍్య కోసం కృషిచేసిన పూలే జీవిత చరమాంకం వరకు బలహీన వర్గాలకోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి. కాగా పూలే బాటలో బలహీన వర్గాల కోసం రూ.5వేల కోట్లు నిధులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చుచేస్తున్నట్లు' తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. 'సమాజం కోసం అంకితభావంతో కృషిచేసిన వ్యక్తి పూలే. అదే మార్గంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని సీఎం వైఎస్‌ జగన్‌ 50శాతం రిజర్వేషన్లు తెచ్చి మరో అభినవ పూలేగా మారారని ప్రజలు కొనియాడుతున్నట్లు' ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు