మాట తప్పని మిత్రుడు

5 Oct, 2019 11:32 IST|Sakshi
ఆటో యజమానురాలికి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం పత్రాన్ని అందజేస్తున్న మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. చిత్రంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్

‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ ప్రారంభోత్సవంలోసీఎం  జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంశల జల్లు

ఫిట్‌నెస్, బీమాలకు రూ.10వేలు పంపిణీ

సాక్షి, బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మాట తప్పం మడప తిప్పం అనే సిద్ధాంతం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తన తండ్రి నుంచి వచ్చిన  వారసత్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ నడుపుకొనే యాజమానుల కోసం ప్రవేశపెట్టిన  ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని ఆయన కాకినాడ అంబేద్కర్‌ భవన్‌లో శుక్రవారం ప్రారంభించారు. ముందుగా సభాధ్యక్షుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ సందేశాన్ని చదివి వినిపించారు. ఏలూరులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగాన్ని ఎల్‌ఈడీ  స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్భాటం, ప్రచారం తప్ప ఏమీ చేయలేదని, అలాగే ఏ పథకం ప్రవేశపెట్టినా గ్రామానికి పట్టుమని పది మందికి కూడా ఇచ్చేవారు కాదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనేది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పెన్షన్ల సంఖ్యను 14 లక్షల నుంచి ఒక్కసారిగా 73 లక్షలకు పెంచి పేదల పాలిట కల్పతరువుగా నిలిచారన్నారు. మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వంలో లోకేష్‌కు తప్ప ఎవ్వరికీ జాబు రాలేదని గుర్తు చేశారు. నాలుగు నెలలో కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని, వాటిలో లక్షా 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దేశ చరిత్రలో నిలిచామని అన్నారు. సభలో పాల్గొన్న శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా 60 వేల వాహన యాజమానులు ఉంటే వారిలో 19వేల మందికి మాత్రమే ఇచ్చారని సభలో అన్నారు. దానికి మంత్రి విశ్వరూప్‌ సవాల్‌ విసిరి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అమలు చేశామని, అవసరమైతే చర్చకు సిద్ధమని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చూశామని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తున్నామని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా వైఎస్సార్‌ వాహన మిత్ర, రైతు భరోసా, జనవరిలో అమ్మ ఒడి వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆటో యూనియన్లకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులైన వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు.

నగర మేయర్‌ సుంకర పావని, శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని స్వాగతిస్తూ ఇది మంచి పథకమని వాహనదారులందరూ వీటిని వాహనం నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ మురళీధరరెడ్డి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాల్సిందిగా ముఖ్యమంత్రి అదేశించారని, అలాగే లైసెన్స్‌ వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ, చిరునామా ఈ జిల్లాలో ఉంటే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని తెలిపారన్నారు. డీటీసీ సీహెచ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి 19,209 మంది అర్హత సాధించారని, వీరందరికీ నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. ఒక వ్యక్తి పేరుతో ఎన్ని వాహనాలు ఉన్నా ఒక్క వాహనానికి మాత్రమే అర్హులు అవుతారని, అలాగే వాహనానికి సంబంధించి ఆర్‌సీ, లైసెన్స్‌ వంటివి సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులేనని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి విశ్వరూప్‌ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఆర్థిక సాయం, సందేశాత్మక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ లంకే హేమతల, ఆర్‌టీఓ రామప్రసాద్, రవాణా శాఖ అధికారులు యడ్ల సురేష్, కళాజ్యోతి, సురేష్‌కుమార్, లక్ష్మీకిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణపై డాక్యుమెంటరీ
‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ప్రారంభానికి ముందు వాహన ప్రమాదాల నివారణపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ సభికులను ఆలోచింపజేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పినిపే విశ్వరూప్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్‌ మురళీధరరెడ్డి ఆ డాక్యుమెంటరీని తిలకించి అభినందించారు. రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కళాజ్యోతి స్కిట్‌ రచనతో పాటు దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన డాక్యుమెంటరీ ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఆటో యజమానులను ఆకట్టుకుంది. ముఖ్య కూడళ్లలో, అలాగే జాతీయ రహదారి, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, సీటు బెల్టు డ్రైవింగ్, అధిక బరువు వాహనాల వంటి ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీలో ఎంవీఐ నరసింహారావు, ఏఎంవీఐ యడ్ల సురేష్‌బాబు, బుక్కా శ్రీనివాసరావులతో పాటు అన్ని క్యాడర్ల సిబ్బంది నటించడం విశేషం. డాక్యుమెంటరీ వీక్షించిన వారందరిలో కాసేపు వాహన ప్రమాదాలతో పాటు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగింది. ఇటువంటి వాటిని ముఖ్యమైన కూడళ్లతో పాటు సినిమా హాళ్లలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తే అవగాహన కలుగుతుందని జిల్లా అధికారులు సూచించారు.

తండ్రికి తగ్గ తనయుడి పాలన..
తండ్రికి తగ్గ తనయుడి పాలనలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉంది. పాదయాత్రలో భాగంగా ఏలూరులో ఆటో డ్రైవర్లకు ప్రకటించిన ఆర్థిక సాయం ప్రభుత్వం వచ్చిన నాలుగునెలల కాలంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏ నాయకుడికీ రాని ఆలోచన వచ్చి మా లాంటి వారిని ఆదుకున్నారు.  
– జి.వేంకటేశ్వరరావు, పి.గన్నవరం ఆటో యూనియన్‌ అధ్యక్షుడు

ముఖ్యమంత్రికి అండగా ఉంటాం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆటో కార్మికులందరమూ అండగా ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో, మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడి హయాంలో సమర్థవంతమైన పాలన చూస్తున్నాం. అన్న మాట ప్రకారం వాహన యాజమానులకు సహకారం అందజేశారు.
– ఎం.శ్రీనివాసరావు, ఆటో యజమాని, గన్నవరం

మరిన్ని వార్తలు