విశాఖ మెట్రో కారిడార్‌ మార్గాలను పరిశీలించిన మంత్రులు

1 Dec, 2019 04:35 IST|Sakshi
మెట్రో రైలు ప్రాజెక్టు రూట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రులు బొత్స, ముత్తంశెట్టి

బలహీన వర్గాలకు టిడ్కో ఇల్లు ఉచితం – మంత్రి బొత్స

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కారిడార్ల మార్గాలను శనివారం మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. గాజువాక, ఎన్‌ఎడీ, తాటిచెట్లపాలెం, ఆర్‌కే బీచ్‌ ప్రాంతాల్లో పర్యటించి.. కారిడార్‌ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు.

8 కారిడార్లుగా లైట్‌ మెట్రో ప్రాజెక్టుని అభివృద్ధి చెయ్యనున్నామని వెల్లడించారు. తొలి దశలో 3 కారిడార్లలో 46.42 కి.మీ. మేర ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ప్రభుత్వం సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోందని మంత్రి ముత్తంశెట్టి వివరించారు. ప్రభుత్వం టిడ్కో ద్వారా చేపట్టిన గృహ నిర్మాణంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.106 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. బలహీన వర్గాలకు ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుందన్నారు.

కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి, కలెక్టర్‌ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, వీఎంఆర్‌డీఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా