మంత్రి తమ్ముడి తడాఖా

22 Aug, 2013 02:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్ :  వరంగల్‌లోని శాయంపేటలో ప్రభుత్వ పాఠశాల పక్కనే 305/ఏబీ సర్వే నెంబర్‌లో 2.16 ఎకరాల స్థలముంది. 23 ఏళ్ల కిందట టీచర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. కట్కు వీరయ్య నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. సొసైటీ అధ్యక్షుడు డోలి రాజలింగం పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పట్టాదారు అడంగల్ పహాణీలో ఆయన పేరే ఉంది. ఈ స్థలంలో ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్‌ను సైతం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదించింది. సొసైటీ పరిధిలో 27 మంది సభ్యులు ఇక్కడి ప్లాట్లను కొనుగోలు చేశారు.. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

హద్దు రాళ్లు కూడా పాతుకున్నారు. కాలక్రమంలో ఈ స్థలానికి డిమాండ్ పెరిగింది. నగరం విస్తరించిన కొద్దీ.. శాయంపేట ఖరీదైన ప్రాంతంగా అవతరించింది. ఈ ప్రాంతంలో భూముల ధరలకు  రెక్కలొచ్చాయి. 1991లో సొసైటీ సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ చదరపు గజం రేటు కేవలం 40 రూపాయలే. ఇదే ప్రాంతం లో ఇప్పుడు గజం రూ.5000 నుంచి రూ.6000 ధర పలుకుతోంది. ఈ లెక్కన టీచర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట ఉన్న స్థలం విలువ రూ.5 కోట్లు దాటింది. అంత ఖరీదైన స్థలం కావడంతో మంత్రి తమ్ముడు దీనిపై కన్నేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఏళ్లకేళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూములను ఈ ఏడాది మే నెలలో ఆయన పేరిట ఎలా మార్చారో అంతు చిక్కటం లేదని, బోగస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని భూమి కబ్జాకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ‘రసుమతి హోటల్స్ లిమిటెడ్, బాలసముద్రం-హన్మకొండ’ చిరునామాతో మేనేజింగ్ డెరైక్టర్ రామ్మోహన్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని.. ప్లాట్ల యజమానులకు సంబంధం లేకుండా అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు. హద్దురాళ్లు తొలగించి దౌర్జన్యానికి పాల్పడుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, తమ లేఅవుట్ ప్లాట్లకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు... ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతో ఈ బాగోతం బట్టబయలైంది.
 

మరిన్ని వార్తలు