మరో అల్లూరి.. సీఎం జగన్‌

17 Dec, 2019 03:08 IST|Sakshi

గిరిజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికే ఎస్టీ కమిషన్‌

వారి హక్కులకు భంగం కలిగితే కమిషన్‌ ప్రశ్నిస్తుంది

ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

సాక్షి, అమరావతి: చరిత్రలో గిరిజనుల హక్కుల కోసం పోరాడింది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజైతే.. ప్రస్తుతం గిరిజనుల హక్కుల కోసం ఎస్టీ కమిషన్‌ తీసుకొచ్చి ఆదివాసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మరో అల్లూరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. దీపం లేని గిరిజన గుడిసెలు ఉంటాయేమో కానీ జగన్‌ లేని గిరిజన గుండె ఉండదన్నారు. ఏపీ రాష్ట్ర షెడ్యూల్‌ ట్రైబ్స్‌ కమిషన్‌ బిల్లును ఆమె సోమవారం శాసనసభలో చర్చకు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజనుల హక్కులకు భంగం కలిగినా, సామాజిక వివక్ష చూపినా, గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడినా, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినా ఈ కమిషన్‌ ప్రశ్నిస్తుందన్నారు. గిరిజన సబ్‌ ప్లాన్‌ నిధుల వినియోగాన్ని పరిశీలించడంతోపాటు గిరిజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి అవసరమైన సలహాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు.  

దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: నారాయణ స్వామి
బిల్లు సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే సుధాకర్‌ బాబులు చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.

’నారావారిపల్లెలోని గుడిలోకి ఇప్పటికీ మాల, మాదిగల్ని రానివ్వనిమాట నిజం కాదా? గతంలో మీకు వ్యతిరేకంగా ఓటేసిన 300 మంది దళితుల ఇళ్లను తగులబెట్టిన మాట నిజంకాదా? కారంచేడు మాదిగ పల్లె దుస్థితికి మీరు కారణం కాదా? అని మంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. దళితులు శుభ్రంగా ఉండరని ఆదినారాయణరెడ్డి హేళన చేసినా.. మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదని, మాదిగలు, మాలల మధ్య చిచ్చుపెట్టింది మీరు కాదా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు నిలదీశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సీఆర్‌డీఏ పరిధిలోని ఓ గ్రామంలో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, బాలరాజు, జోగి రమేష్‌ తదితరులు ప్రసంగించారు.  

గిరిజనులంతా వైఎస్‌ జగన్‌ వెంటే:  రాజన్నదొర

గిరిజనులంతా వైఎస్‌ జగన్‌ వెంటే ఉన్నారని, ఏడు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించడమే దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు.  
కొత్త చరిత్రకు శ్రీకారం: కళావతి
ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుతో సీఎం వైఎస్‌ జగన్‌ గిరిజనుల జీవితాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పేర్కొన్నారు. తద్వారా గిరిజనులకు రక్షణ కల్పించారన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

చంద్రబాబు బాక్సైట్‌ దాహానికి గిరిజన ఎమ్మెల్యే బలయ్యారు: టి.బాలరాజు
బాక్సైట్‌ తవ్వకాలతో చంద్రబాబు గిరిజనుల బతుకులను ఛిద్రం చేయాలని చూశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టి.బాలరాజు విమర్శించారు. చంద్రబాబు బాక్సైట్‌æ దాçహానికి ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన గూడేల్లో పర్యటించి.. అక్కడే నిద్రించి.. వారి కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు. అందుకే బాక్సైట్‌ తవ్వకాల జీవోను రద్దు చేసి గిరిజనుల జీవితాలకు భరోసా ఇచ్చారన్నారు.
 
దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు: గొల్ల బాబూరావు
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లు సాహసోపేతమైందని పలువురు కొనియాడారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు గొల్లబాబూరావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. దళితులు, గిరిజనులకు ఉపయోగపడే మంచి బిల్లులని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సమర్ధించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతగా జగన్‌ ప్రజల్లో గుర్తుండిపోతారని కీర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు బిల్లును సమర్ధించారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ప్రయోజనాన్ని ఆకాంక్షించే ఈ బిల్లుతో వారు జగన్‌ వైపే శాశ్వతంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.
 
చంద్రబాబు గిరిజనులను దగా చేశారు: భాగ్యలక్ష్మి
చంద్రబాబు గిరిజనుల హక్కులను భక్షిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ గిరిజనుల హక్కులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా జీవో జారీ చేసి చంద్రబాబు గిరిజనులను దగా చేశారని దుయ్యబట్టారు. 1/70 చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి టీడీపీ పెద్దలు అడవులను దోచుకున్నారని ధ్వజమెత్తారు.
 
జగన్‌ వెంటే దళిత, గిరిజనం: మేరుగ 
దళితులు, గిరిజనుల కోసం పాటుపడిన ఘనత వైఎస్‌ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చెప్పారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయడంతో దళితులు ధైర్యంగా ఉన్నారన్నారు. ఆయన తర్వాత అణగారిన, బహుజనుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు తెస్తున్న ఔదార్యం సీఎం వైఎస్‌ జగన్‌దని చెప్పారు. దళితులు, గిరిజనులు ఎప్పటికీ జగన్‌ వెంటే ఉంటారన్నారు. 

మరిన్ని వార్తలు