మంత్రుల లేఖలు బుట్టదాఖలు

31 Aug, 2018 03:18 IST|Sakshi

కాంట్రాక్టు వైద్యుల క్రమబద్ధీకరణకు ముగ్గురు మంత్రుల లేఖ

ఉప ముఖ్యమంత్రి కేఈ లేఖనూ పట్టించుకోని ఆరోగ్యశాఖ

 ఏజెన్సీల్లో ఇప్పటికే కాంట్రాక్టు వైద్యుల రాజీనామాలు

సాక్షి, అమరావతి: సాక్షాత్తూ మంత్రుల లేఖలనే సర్కారు పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తుంటే ఇక సామాన్యుల ఫిర్యాదులకు దిక్కెవరు? ముగ్గురు కేబినెట్‌ మంత్రులు ఓ సమస్య పరిష్కారం కోసం సిఫారసులతో ప్రభుత్వానికి లేఖ రాస్తే ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేఖను సైతం లక్ష్యపెట్టకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హామీని నిలబెట్టుకోవాలని మంత్రుల సూచన
రాష్ట్రంలో కాంట్రాక్టు వైద్యులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ వీరు పలుమార్లు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. మూడేళ్లు పనిచేస్తే తమను క్రమబద్ధీకరిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా పట్టించుకోకపోవడంతో మంత్రుల దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏజన్సీ ప్రాంతాల్లో పలువురు కాంట్రాక్టు వైద్యులు ఇప్పటికే విధుల నుంచి తప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టు వైద్యులు దీర్ఘకాలంగా పని చేస్తున్నందున వారిని క్రమబద్ధీకరించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని సూచిస్తూ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కిమిడి కళావెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. మూడేళ్ల సర్వీసు దాటిన వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని గతంలో ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వైద్య ఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రే ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తుండటంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిన పని లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మంత్రుల లేఖలను చిత్తు కాగితాలు కింద పరిగణించి బుట్ట దాఖలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


ఖాళీగానే చాలా పోస్టులు..
కొన్నేళ్లుగా పలువురు కాంట్రాక్టు వైద్యులు గ్రామీణ ప్రాం తాల్లో పని చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నందున రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించాలి. దీనిపై వైద్యులు పదేపదే కోరుతున్నారు. త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీచేయాలి. – కేఈ కృష్ణమూర్తి (డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి)

మానవత్వంతో నిర్ణయం తీసుకోవాలి
కాంట్రాక్టు వైద్యుల రెగ్యులైజేషన్‌ అంశాన్ని మీ (ముఖ్యమంత్రి) దృష్టికి తీసుకువస్తున్నా. ఇప్పటికే పలు వైద్య సంఘాలు ఈ విషయంపై నాకు విన్నవించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. – కిమిడి కళావెంకట్రావు (విద్యుత్‌ శాఖ మంత్రి)

క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారు
రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కామినేని శ్రీనివాస్‌ మంత్రిగా ఉండగా హామీ ఇచ్చారు. దీనిపై త్వరలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలి. – కాల్వ శ్రీనివాసులు (గృహ నిర్మాణ శాఖ మంత్రి)

మరిన్ని వార్తలు