వైఎస్‌ జగన్ పాలనలో ఏ ఒక్కరికి నష్టం జరగదు

27 Sep, 2019 18:14 IST|Sakshi

సాక్షి, వైఎస్‌ఆర్‌ : ప్రభుత్వ భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. కడప జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌లో మంత్రులు శ్రీ రంగనాథరాజు, జిల్లా ఇంచార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ 'ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం. ప్రతి పేదవాడికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది ఇళ్ల స్థలాలకి అర్హులుగా అధికారులు గుర్తించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కుల, మత భేదాలు చూడకుండా ప్రతీ ఒక్క పేద కుటంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఇప్పటిదాకా మనం ఎక్కడా చూడలేదు. 1983 నుంచి భూరికార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అక్టోబర్ 2న గ్రామసచివాలయాల ద్వారా 11 వేల మంది సర్వేయర్లను నియమిస్తున్నాం. వీరిని ఉపయోగించుకుని భూ రికార్డులు పక్కాగా ఉండేలా చూస్తాం. వైఎస్‌ జగన్ పరిపాలనలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ పథకాలు వెళ్లాలన్నదే' ముఖ్యమంత్రి ధృడసంకల్పమన్నారు. గృహ నిర్మాణ శాఖా మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ జియో ట్యాగింగ్  యాప్ ద్వారా సర్వే చేసి, భూ కబ్జాదారులపై కఠిన చర్యలకు  అదేశాలు ఇవ్వడం జరిగింది. కడప విమానాశ్రయం పక్కన ఉన్న స్థలంలో ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడుతూ 'పేదలందరికి ఇల్లు అనేది నవరత్నాలలో భాగంగా ప్రజలకు ఇచ్చిన వరమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 90 శాతం మేర ఇప్పటికే అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యత కల్పించాం. ప్రజలకు ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసి చూపించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది.

సామాన్య మానవునికి అవసరమైన ప్రతి కార్యక్రమాన్నిఅత్యంత పారదర్శకతతో చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. అమ్మఒడి కార్యక్రమం ద్వారా దేశంలో విన్నూత్న పథకానికి శ్రీకారం చుట్టాం. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరచి ప్రస్తుత ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలలో దూసుకుపోతోంది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లిస్తాం. రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా 13జిల్లాల అభివృద్ధిపైనా దృష్టి సాధించాం. రాజన్న పాలనను అందించడానికి తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు' గర్వంగా ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు