ప్రియుడి కోసం బాలిక హంగామా

25 Oct, 2019 07:21 IST|Sakshi
ప్రియుడి తండ్రి రాకతో బయటికొస్తున్న బాలిక

తల్లి, అక్కను ఇంట్లో బంధించిన వైనం

ప్రేమికుడు వస్తేనే తలుపులు తెరుస్తానంటూ వీరంగం

పోలీసులు, అధికారులు నచ్చజెప్పినా బేఖాతర్‌

నాలుగు గంటలపాటు సాగిన రభస

ఎట్టకేలకు మైనర్‌ బాలికను జువనైల్‌ హోమ్‌కు తరలింపు

చిత్తూరు,పలమనేరు : తన ప్రేమికుడు వస్తేగానీ ఇంట్లో బంధించిన కుటుంబ సభ్యులను వదలనంటూ ఓ బాలిక నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన గురువారం సాయంత్రం పలమనేరులో చోటుచేసుకుంది. పట్టణ సీఐ శ్రీధర్‌ కథనం.. స్థానిక నాగులురాళ్లువీధిలో కాపురముంటున్న ఓ దంపతులకు ఇరువురు కుమార్తెలున్నారు. వీరి చిన్నమ్మాయి (మైనర్‌) గత ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా స్థానికం ఉన్న కొరియర్‌ బాయ్‌ రెహమాన్‌ను ప్రేమించానంటూ ఇంటినుంచి అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్‌పై పోలీసులు కిడ్నాప్, ఫాక్సో కేసు నమోదు చేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. తన కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆందోళన చెందిన బాలిక తండ్రి  కుమార్తెను కళాశాలకు పంపడం మానేశారు.కేసు నమోదయ్యాక సైలెంట్‌గా ఉన్న ప్రేమికుడు మళ్లీ బాలిక ఉంటున్న వీధిలో తిరగడం మొదలెట్టాడు.

ఇది గమనించిన బాలిక గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న తన తల్లి, అక్కను లోనఉంచి హాలుకు తాళం వేసింది. తాను వరండాలో ఉంటూ గేటు వేసుకుంది. లోపల నుంచి బిగ్గరగా అరుస్తూ నానా హంగా మా చేసింది. విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పట్టణ సీఐ, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఐసీడీఎస్‌ సిబ్బందితో కలసి బాలిక ఇంటికి వెళ్లారు. తాము న్యాయం చేస్తామంటూ ఎంత చెప్పినా బాలిక ఖాతరు చేయకుండా తనకు ప్రియుడే  ముఖ్యమంటూ, తల్లిదండ్రులు ఏడాదిగా వేధిస్తున్నారని అరచి గోల గోల చేసింది. తాము ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పిస్తామంటూ తహసీల్దార్‌ బతిమలాడినా ఆ బాలిక బయటకు రాలేదు.

లవర్‌ వస్తేగానీ రానంటూ గట్టిగా చెప్పింది. ఎట్టకేలకు ప్రియుడి తండ్రి వచ్చి తానున్నానంటూ బాలికను బయటకు రప్పించాడు. బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్న అధికారులు బాల్య వివాహాలు చట్టవిరుద్ధమంటూ బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మైనార్టీ తీరేదాకా తిరుపతి జువనైల్‌ హోమ్‌కు తరలించాలని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. అయితే తమ కుమార్తెను తాము వేధించడం లేదని ఎప్పుడు చూసినా ప్రేమ, ప్రేమ అంటోందని ఆ భయంతో కళాశాలకు ఇద్దరు కుమార్తెలనూ పంపడం ఆపేశామని బాలిక తల్లి కన్నీటిపర్యంతమైంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా