మైనర్‌కా.. మేజర్‌కా?

18 Nov, 2013 04:25 IST|Sakshi

కర్నూలు రూరల్, న్యూస్‌లైన్ : తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడం కోసం తలపెట్టిన గురురాఘవేంద్ర ప్రాజెక్టు, పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నామంటూ మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ ఆ పనుల బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. దీంతో పర్యవేక్షణ విషయం త్రిశంకు స్వర్గంలో పడడంతో పనులు నిలిచిపోయాయి. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు 14 ఏళ్ల క్రితం పునాది రాయి పడినప్పటికీ ఇప్పటికీ 60శాతం పనులు కూడా పూర్తికాలేదు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్-1 సూపరెండెంట్ పర్యవేక్షణలో ఐదేళ్లు దాటినా పనుల విషయంలో పురోగతి లేకపోవడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అధికారుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

 అప్పటికీ అధికారులు తీరు మారకపోవడం, ఎత్తిపోతల పథకాల డిజైన్, పనులకు సంబంధించిన పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం, మరోవైపు పనుల ప్రగతిపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తుండడం తదితరకారణాల వల్ల ఏజెన్సీవారు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విషయాలు తెలుసుకున్న ఆయన గురురాఘవేంద్ర ప్రాజెక్టు పనుల బాధ్యతను హంద్రీనీవా నుంచి  తప్పించాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆ పనుల పర్యవేక్షణ బాధ్యతలను మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈకి అప్పగించాలంటూ గత నెల(అక్టోబర్) 22వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ బాధ్యత తీసుకోవాలంటూ సీఈ అదే నెల 26వతేదీన ఎస్‌ఈకి ఆదేశాలు జారీ చేశారు. అయితే పని భారం అధికంగా ఉందంటూ సీఈ ఉత్తర్వులను ఎస్‌ఈ వెనక్కు పంపారు. కాంట్రాక్టర్ అధికారులు అడిగినంత మేరకు కమీషన్ ఇవ్వకపోవడంతోనే పనులు పర్యవేక్షణ చేయకుండా, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పనుల్లో జాప్యానికి ఇదే కారణంగా తెలుస్తోంది.
 పులకుర్తిదీ ఇదే దారి..
 కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలోని దిగువ కాల్వ ఆయకట్టుకు సాగునీరందించేందుకు చేపట్టిన పులకుర్తి ఎతిపోతల పథకం బాధ్యతను కూడా హంద్రీనీవాకు తప్పించారు. గతేడాది అక్టోబరులో ఇందుకు సంబంధించి కోడుమూరులో ఫైలాన్ ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లోపంతో పనులు ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  అయితే ఈ పనుల బాధ్యతలను తీసుకునేందుకు కూడా ఎస్‌ఈ ససేమిరా అంటున్నారు.

>
మరిన్ని వార్తలు