ముస్లింల ఓట్ల తొలగింపు

3 Apr, 2019 12:52 IST|Sakshi
మీ–సేవ కేంద్రంలో గుర్తింపు కార్డుల కోసం వేచిఉన్న ఓటరు

ముస్లింల ఓట్ల తొలగింపు

ఓటర్‌ గుర్తింపుకార్డులు అందేనా!

మీ–సేవ కేంద్రాల చుట్టూ బాధితుల ప్రదక్షణలు 

ఆన్‌లైన్‌లో కార్డులు డౌన్‌లోడ్‌ కావడంలేదు  

నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారపార్టీ కుట్రలు చేస్తోంది. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ముస్లింలు అధిక శాతం మంది మద్దతుగా ఉన్నారు. ముస్లింల ఓట్లు తొలగించేలా అధికారపార్టీ కుతంత్రాలు చేసింది.  నెల్లూరుసిటీ నియోజకవర్గానికి సంబంధించి వెంకటేశ్వరపురంలో 300 ముస్లిం ఓట్లు తొలగించారు. షేక్‌ ఖలీమ్‌ కుటుంబానికి సంబంధించి, ఆయన బంధువులు అందరివీ కలిపి సుమారు 50 ఓట్లు తొలగించారు. ఓటర్‌ కార్డు ఉండడంతో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయని అనుకున్నారు.

ఒకసారి చెక్‌ చేసుకుందామని జాబితాను పరిశీలించారు. వారి 50 ఓట్లు తొలగించారని గుర్తించారు. ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. ఆ ఇద్దరికి కూడా వెంకటేశ్వరపురంలో కాకుండా కొత్తూరులో ఓటు హక్కు కల్పించారు. ఇది అధికారులు, అధికారపార్టీ  నాయకుల చేసిన కుట్రే. జిల్లా వ్యాప్తంగా ముస్లింల ఓట్లు తొలగించారు. ముస్లింలను గుర్తింపుకార్డులకు మాత్రమే పరి మితం చేశారు.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్లు వేల సంఖ్యలో తొలగించారు. కొత్తగా పెరిగిన ఓట్లు అధికారపార్టీకి అనుకూలంగా ఉండే వారివే అధికంగా ఉన్నాయని విమర్శలున్నాయి. జిల్లాలో 32.50 లక్షల మంది జనాభా ఉన్నారు. పెరిగిన ఓటర్లతో కలిíపి జిల్లాలో 23,92,210 మంది ఉన్నారు. జనాభా ప్రాతిపదికన పరిశీలించిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా మరణించిన వారు ఓట్లు తొలగించకుండా బతికున్న వారి ఓట్లు తొలగించారు. 
అందని కార్డులు
సార్వత్రిక ఎన్నికలు 2019కి సంబంధించి పోలింగ్‌ ప్రక్రియకు ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత వరకు పెరిగిన ఓటర్లకు గుర్తిపుకార్డులు అందలేదు. ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మీ–సేవ  కేంద్రాల్లో ఓటర్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కావడంలేదు. రాత్రి 10 గంటల తరువాత ఉదయం 9 గంటల లోపు మాత్రమే సైట్‌ పని చేస్తోంది.

పట్టించుకోని జిల్లా యంత్రాంగం
ఓటర్‌  కార్డులు డౌన్‌లోడ్‌ చేసి ప్రజలకు అందజేయాలన్నా మీ–సేవ నిర్వాహకులకు హోలో గ్రామ్స్‌ అందుబాటులో లేవు. హోలోగ్రామ్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద అందుబాటులో ఉన్న వాటిని మీ–సేవ కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వడంలేదు. గుర్తింపు కార్డులు త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. మీ–సేవ ఏఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారులు స్పందించి ప్రతి ఒక్కరికీ ఓటర్‌ గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు