మిర్చిని మింగేస్తోంది

3 Mar, 2020 04:07 IST|Sakshi

కాయ కుళ్లు తెగులుతో తీవ్ర ఆందోళనలో రైతులు 

నివారణకు ఉద్యాన శాఖ చర్యలు 

నేటి నుంచి క్షేత్రాల్లోకి అధికారులు, శాస్త్రవేత్తలు 

సాక్షి, అమరావతి: వాణిజ్య పంటల్లో ప్రధానమైన మిర్చికి కాయ కుళ్లు సోకి రైతులను అపార నష్టాలకు గురి చేస్తోంది. ప్రస్తుత వాతావరణం, అకాల వర్షాలు, మంచు, భూమిలో తేమ వంటి వాటి వల్ల ఈ తెగులు సోకుతోంది. దీనివల్ల మార్కెట్‌లో ధర పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన శాఖాధికారులు రైతుల్ని అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి రైతులకు నేరుగా సూచనలు, సలహాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. 

తెగులు పరిస్థితి ఇలా.. 
ప్రస్తుతం మిరప కాయ పండే దశలో కొంత, కోత దశలో మరికొంత ఉంది. కోత తర్వాత రవాణా, నిల్వ చేసే దశలో కూడా ఈ తెగులు రావొచ్చు. ఇప్పటికే పలుచోట్ల కాయ కుళ్లు సోకి తాలు కాయలుగా మారి రైతులు నష్టపోతున్నారు. కొల్లిటోట్రైకమ్‌ అనే శిలీంధ్రం వల్ల ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల 10నుంచి 54 శాతం వరకు దిగుబడి తగ్గిపోతుంది. కాయ నాణ్యత లోపిస్తుంది. పూత సమయంలో మొదలై ఈ నెలాఖరు (మార్చి) వరకు ఈ తెగులు కనిపిస్తూనే ఉంది. అకాల వర్షాలు పడితే తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నీటి పారుదల కింద సాగయ్యే తోటల్లో ఈ బెడద ఎక్కువగా ఉంది.

ప్రత్యేకించి నేలకు దగ్గరగా ఉన్న వాటి కాయలు లేదా ఆకులపై కాయ కుళ్లు లక్షణాలను గమనించవచ్చు. పండు కాయలపై తొలుత చిన్న నీటి మచ్చలు ఏర్పడి క్రమేపీ పెరుగుతాయి. మచ్చలు నలుపు రంగులోకి మారతాయి. తెగులు ఉధృతి ఎక్కువయ్యే కొద్దీ మచ్చల మధ్య భాగంలో వలయాలు ఏర్పడతాయి. పచ్చి కాయలకు కూడా శిలీంధ్రం సోకుతుంది. కానీ.. కాయ పండిన తరువాతే లక్షణాలు బయట పడతాయి. కుళ్లిన కాయలు రాలిపోతాయి. తెగులు ఆశించిన కాయలు ఎండిన తరువాత తాలు కాయలుగా మారతాయి. తాలు కాయలకు మార్కెట్‌లో ధర వుండదు. 

నివారణ ఎలాగంటే..
పంట మారుస్తుండాలి. విత్తనం నుంచి తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మేలైన కాయ నుంచి విత్తనాన్ని సేకరించి శుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల కాప్టా్టన్‌తో లేదా 3 గ్రాముల మాంకోజెబ్‌ పట్టించి శుద్ధి చేయాలి. కాయలు పండటం మొదలైన వెంటనే ముందుజాగ్రత్త చర్యగా మాంకోజెబ్, కార్బండిజమ్‌ 2.5 గ్రాములు లేదా క్లోరోదలోనిల్‌ 2 గ్రాములు, ప్రోపినెబ్‌ 2 గ్రాముల్ని లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశిస్తే అజాక్స్‌ స్త్రోబిన్, ప్రోపికొనజోల్, డైఫిన్‌ కొనజోల్, కాపర్‌ హైడ్రాక్సైడ్, పైరా క్లోస్ట్రోబిన్, మేటిరమ్, టేబుకోనజోల్, ట్రైప్లొక్స్‌ స్త్రోబిన్‌ మందులలో ఏదో ఒక దానిని 10 రోజుల వ్యవధిలో 2, 3 సార్లు పిచికారీ చేయాలని గుంటూరు లాంఫామ్‌లోని ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.హరిప్రసాదరావు సూచించారు. 

నేటినుంచి శాస్త్రవేత్తల బృందాల పర్యటన 
కాయ కుళ్లు తెగులుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. కాయ కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా చేలల్లో ఉన్న కాయలు నాణ్యత కోల్పోకుండా కాపాడుకునేందుకు సూచనలు, సలహాలను ఈ బృందం ఇస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న తరుణంలో రైతులకు అవగాహన కల్పిస్తే ఇప్పుడే కాకుండా భవిష్యత్‌లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు హనుమంతరావు చెప్పారు. 

తెగులు ఉధృతికి కారణాలివీ 
- తెగులును తట్టుకోలేని రకాల సాగు 
- ఏకరూప పంట వేయడం 
- కాయ పండే దశలో వర్షాలు కురవడం 
- నీటి తడులు ఎక్కువగా పెట్టడం, తేమ ఎక్కువగా ఉండటం 
- ఆకులు, కాయలపై తేమ ఎక్కువ సేపు ఉండటం 
20–24 డిగ్రీల ఉష్ణోగ్రత, 80 శాతం కంటే ఎక్కువ తేమ ఉండి మంచు ఎక్కువగా కురవడం  

మరిన్ని వార్తలు