ఘాటు తగ్గిన మిరప

24 May, 2014 01:33 IST|Sakshi
ఘాటు తగ్గిన మిరప

 ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: నెల క్రితం వరకు మంచి ఓ మోస్తరుగా ఉన్న మిరపకాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధిక వర్షాలు, తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల మండలాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. గతేడాది మిరపకాయలు క్వింటా రూ. 4వేల నుంచి రూ. 4,500 వరకు ధర పలికాయి. ఖరీఫ్‌లో క్వింటా రూ. 10 వేలకు పైగానే పలికింది.

దీంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఫిబ్రవరిలో గుంటూరు మార్కెట్‌లో ఇదే ధర ఉన్నట్లు నల్లగట్ల గ్రామానికి చెందిన రైతు విజయ్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ప్రస్తుతం మిరప కోతలు పూర్తికావడం తో రైతులు అమ్మకానికి సిద్ధం చేశారు. తీరా పంట చేతికొచ్చాక మిరపకాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉందని, అధిక వర్షాలు, తెగుళ్లతో ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వచ్చిందని గూబగుండం గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి వాపోయాడు.

ప్రస్తుతం మిరపకాయ ధరలు క్వింటా రూ. 4,500 లోపు  మాత్రమే ఉండటంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 70వేల నుంచి రూ. 80వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు తెలిపారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడులు మాత్రమే చేతికి వస్తాయని, అంతకు తగ్గితే నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు