ఈ జిల్లాలో మీరొద్దు!

19 Jun, 2014 02:55 IST|Sakshi
ఈ జిల్లాలో మీరొద్దు!
  •      ఇక్కడ పనిచేసే వైఎస్‌ఆర్ జిల్లా అధికారికి బొజ్జల హుకుం
  •      అధికారులు, టీడీపీ నేతల సమక్షంలోనే మంత్రి వ్యాఖ్యలు
  •      అనుకూల అధికారులను తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతల ప్రయత్నాలు
  • సాక్షి, తిరుపతి: జిల్లాలో పనిచేస్తున్న కొం దరు అధికారులకు అధికారపార్టీ నేతల నుంచి సూటిపోటి మాట లు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి అవి శ్రుతిమించి అధికారులు నొచ్చుకునే స్థాయికి వెళ్తున్నాయి. అధికారుల స్వస్థలాలు, కులాలను కూడా అధికారపార్టీ నేతలు ప్రస్తావిస్తూ  చులకనగా మాట్లాడుతున్నారు.

    జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒక అధికారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య లు ఇందుకు అద్దంపడుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నాలుగు రోజుల కిందట తొలిసారిగా బొజ్జల జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకునే ందుకు వెళ్లిన ఒక కీలక అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఆ సమయంలో ఇంకా చాలా మంది అధికారులు, టీడీపీ నేతలు ఉన్నారన్న విషయం కూడా మంత్రి పట్టించుకోలేదు. సదరు అధికారి ముందుగా మంత్రిని పరిచయం చేసుకున్నారు.

    అంతా విన్న తరువాత మీది ఏ జిల్లా అంటూ మంత్రి ప్రశ్నించారు. వైఎస్సార్ కడప జిల్లా అని అధికారి సమాధానమిచ్చారు. వెంటనే  ఏ మాత్రం తడుముకోకుండా.. ‘అయితే నువ్వు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడవై ఉంటావు. ఈ జిల్లాలో ఉండొద్దు. ఇంకెక్కడికైనా వెళ్లిపో అంటూ’ అంటూ చిన్నచూపుతో మంత్రి మాట్లాడిన తీరు అధికారి మనస్సును తీవ్రంగా గాయపరచింది. ఇది ఆ ఒక్క అధికారి అనుభవం కాదు. ఇటువంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు బయటకు చెప్పుకోలేక మధనపడుతున్నారు.
     
    మంత్రి బాటలోనే..
     
    మంత్రి బాటలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా వ్యవహరిస్తున్నారు. మండల స్థాయి అధికారుల విషయంలో ఈ రకంగానే సూటిపోటి మాటలు మాట్లాడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు అధికారుల బదిలీలు సర్వసాధారణం. అప్పటివరకు ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు ముందు ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నందున బదిలీలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నిబంధనలకు లోబడి బదిలీలు చేయాలే తప్ప కక్షసాధింపుగా ఉండకూడదు. ఉన్నత స్థానంలో ఉన్న అధికారుల పట్ల చులకనభావంతో వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది.
     
    బదిలీల్లో అధికార పార్టీ నేతల జోక్యం
     
    ఇటీవల జిల్లాలో తహశీల్దార్ల పోస్టింగుల్లో అధికారపార్టీ నేతల జోక్యం ఎక్కువగా కనిపించింది. ఈ పోస్టింగ్‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కోరుకున్న తహశీల్దార్లకు ఆయా మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారు. కాగా జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న పలు శాఖల అధికారులు స్వచ్ఛందంగా బదిలీలు కోరుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్‌ల కోసం అధికారపార్టీ నేతలు ఫైళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.

    కీలకమైన పోస్టులకు గిరాకీ ఉండటంతో ఇద్దరుముగ్గురు అధికారులు కూడా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తరువాత బదిలీలకు పైరవీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇంకొందరు బదిలీల కోసం అధికారపార్టీ నేతల చుట్టూ ప్రదక్షణిలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, బొజ్జల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం.
     

మరిన్ని వార్తలు