77 వేల మందికి  ఒక్కటే ఆధార్‌ కేంద్రం!

22 Aug, 2019 04:31 IST|Sakshi
ఆధార్‌ టోకెన్ల కోసం వర్షంలో గొడుగులు పట్టుకొని భారీగా క్యూలో నిలుచున్న జనాలు

వేకువ జాము నుంచే బ్యాంకు ముందు క్యూ కడుతున్న ప్రజలు

వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలో దారుణ పరిస్థితి 

స్కూళ్లు మానేసి క్యూలో నిలబడుతున్న విద్యార్థులు

తోపులాటలో మహిళలు, పిల్లలకు తీవ్ర ఇబ్బందులు  

ఎర్రగుంట్ల: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్‌ తప్పనిసరి కావడంతో ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు జనం త్వరపడుతున్నారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తుండగా వారికి సరిపోయే సంఖ్యలో ఆధార్‌ కేంద్రాలు లేకపోవడంతో గంటల తరబడి క్యూలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం, ఎర్రగుంట్ల మున్సిపాల్టీ పరిధిలో 77 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వీరందరికీ ఎర్రగుంట్లలోని ముద్దనూరు రోడ్డు ఎస్‌బీఐలో ఉన్న ఆధార్‌ కేంద్రం మాత్రమే ఆధారం.

పిల్లలకు కొత్తగా ఆధార్‌ కార్డు కావాలన్నా, మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఇదొక్కటే దిక్కు. దీంతో కొద్దిరోజులుగా జనం రాత్రీ పగలనక ఇక్కడ నిరీక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆధార్‌ టోకెన్ల కోసం భారీగా క్యూ కట్టారు. జోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా టోకెన్లు తీసుకునేందుకు గొడుగులు పట్టుకొని మరీ బారులు తీరారు. 500 మందికి పైగా అక్కడ నిరీక్షిస్తూ కనిపించారు. ఉదయం పది గంటల తరువాత జనం మరింత పెరిగారు.దీంతో కొద్దిపాటి తోపులాట జరిగింది.

రద్దీని నియంత్రించేందుకు సీఐ సదాశివయ్య నలుగురు కానిస్టేబుల్స్‌ను పంపించారు. అయినా చాలా మంది మహిళలు, పిల్లలు తోపులాటలో ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలకు సెలవు పెట్టి మరీ పిల్లలు టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. టోకెన్లు ఇవ్వడం ప్రారంభించాక మరింత తోపులాట జరిగింది. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్‌ సిబ్బంది సైతం లోనికి వెళ్లలేక బయటే నిలబడిపోయారు. గర్భవతులు, బాలింతలు ఈ తోపులాటలో ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు