అనుకోకుండా దక్కిన గెలుపు

8 Oct, 2018 07:51 IST|Sakshi
ద్వితీయ రన్నరప్‌ కిరీటం అందిన ఆనంద క్షణాలు

మొదటి అడుగులోనే గొప్ప విజయం

రెండు కిరీటాలు దక్కిన వైనం

ఆశయసాధనకు 20 కిలోలు తగ్గిన పంతం

మిస్‌ ఇండియా ద్వితీయ రన్నరప్, మిస్‌ ఆంధ్రప్రదేశ్‌గా ఎన్నికైన పల్లవి ప్రత్యేకత

విజయం ఇచ్చే కిక్‌ అలా ఇలా ఉండదు. అందులో ఆనందం అనుభవిస్తే కానీ తెలియదు. అది ఎలా దక్కినా మజా భలేగా ఉంటుంది. అందునా అనూహ్యంగా గెలుపు లభిస్తే.. ఆ ఉత్సాహం ఆకాశం అంచుకు తీసుకెళ్తుంది. క్యాట్‌ వాక్‌ ఎలా చేస్తారో కూడా అంతగా తెలియని అమ్మాయి అందాల పోటీలో రెండు కిరీటాలు దక్కించుకుంటే.. ఆమె సంబరం అలా ఉంటుంది. మోడలింగ్‌ పోటీల్లో ఒక్కసారి కూడా పాల్గొనని యువతి మిస్‌ ఇండియా పోటీల్లో ద్వితీయ రన్నరప్‌గా, మిస్‌ ఆంధ్రప్రదేశ్‌గా రెండు మకుటాలు సొంతం చేసుకుంటే ఆమె అంబరం అంచుల్లో తేలిపోవడంలో ఆశ్చర్యమేముంది? విశాఖకు చెందిన మామిడి సాయి వెంకట పల్లవి ఇప్పుడా ఆనందోత్సాహాలలో మునిగితేలుతోంది. డాజిల్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన గ్రాండ్‌ ఫినాలేలో రెండు కిరీటాలు సాధించిన పల్లవి ఆ సంస్థ ప్రచారకర్తగా ఎంపికయింది. అనుకోకుండా గెలుపు దక్కినందుకు ఆనందంగా ఉందని, అయితే ఫలితాన్ని ఆశించకుండా కష్టపడ్డానని పల్లవి చెబుతోంది.

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘అనుకోకుండా దక్కిన గెలుపు ఎంత సంబరాన్నిస్తుందో ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలుస్తోంది. మోడలింగ్‌ పోటీల్లో పాల్గొన్న అనుభవం లేకుండా.. క్యాట్‌ వాక్‌ ఎలా చేస్తారో తెలియకుండా నేను రెండు టైటిళ్లు గెలిచానంటే నాకే నమ్మశక్యం కాకుండా ఉంది.’ అని మిస్‌ ఇండియా పోటీల్లో ద్వితీయ రన్నరప్, మిస్‌ ఆంధ్రప్రదేశ్‌ మామిడి సాయి వెంకట పల్లవి ఉత్సాహంతో అన్నారు. ఈ పోటీల్లో గెలుపు అనూహ్యమైనదే అయినా.. తాను మాత్రం ఫలితంపై దృష్టి పెట్టకుండా కష్టబడ్డానని చెప్పారు. తన జీవితం గురించి, లక్ష్యాల గురించి ఆమె వివరిస్తూ.. నిజానికి మోడలింగ్‌పై మొదట్లో తనకు దృష్టి లేదని చెప్పారు. ‘నేను ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనుకున్నా. అందుకు సంబంధిత కోర్సు కూడా చేశా. అయితే అమ్మ, నా  స్నేహితులు మాత్రం మోడలింగ్‌ వైపు వెళ్లాలని ప్రోత్సహించారు. దాంతో ఆ రంగంవైపు అడుగులేశాను.’ అని చెప్పారు.

83 నుంచి 60 కిలోలకు...
‘మోడలింగ్‌ చేయాలని అనుకున్నానే కానీ అధిక బరువు నన్ను భయపెట్టింది. ఎలాగైనా బరువు తగ్గాలని సంకల్పించాను. అందుకు రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను. అలా 83 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాను. నాలో మార్పు చూసి ఆశ్చర్యపోని వారు లేరు. చివరికి జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్లు కూడా అబ్బురపడ్డారు. ఇప్పుడు ఆ జిమ్‌ నిర్వాహకులు నా ఫోటోను వారి ప్రచారానికి వినియోగించుకుంటున్నారు.’ అని చెప్పింది.

టాలెంట్‌ ఒక్కటే లెక్క
‘ఒకప్పుడు మోడలింగ్‌ అంటే రకరకాల అభిప్రాయాలుండేవి. కొన్ని విషయాల్లో రాజీ పడితే తప్ప ఆ రంగంలో రాణించలేరన్న తప్పుడు అభిప్రాయం ఉండేది. అది చాలా తప్పు. నిజానికి ఎప్పుడైనా ఎక్కడైనా టాలెంట్‌ ఉంటే విజయం దక్కుతుంది. ప్రతిభ కలవారికి ఆకాశమే హద్దనుకునే పరిస్థితి ఉంది. కేవలం ప్రతిభను నమ్ముకుని రంగంలోకి దిగిన నాకు గెలుపు లభించడం బట్టి చూస్తే... టాలెంట్‌కు గల ప్రాధాన్యం అర్థమవుతుంది.’ అని ఆమె చెప్పారు.

సమాజ సేవ ధ్యేయం
‘విద్యార్ధిగా ఉన్నప్పుడు రాబిన్‌ హుడ్‌ ఆర్మీలో సభ్యురాలిగా ఉండేదానిని. అలా పదిమందికీ ప్రయోజకం కలిగించే పనులు చేసేదానిని. భవిష్యత్తులో సమాజ సేవను కొనసాగిస్తాను. నాకు అవకాశాలు కల్పించిన సమాజానికి వీలైనంత మేరకు మేలు కలిగేలా కృషి చేస్తాను.’ అని పల్లవి చెప్పారు. ప్రాథమిక విద్య అందని పిల్లలకు విద్య అందేలా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతానికి ప్రత్యేకించి లక్ష్యాలు లేనప్పటికీ మోడలింగ్‌లో ఉన్నత స్థానానికి చేరడమే తన ధ్యేయమని.. ఎప్పటికైనా మిస్‌ యూనివర్స్‌ కావాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ రంగం నుంచి సినీ రంగానికి వెళ్లేందుకు పట్టుదలతో కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు