ప్రమాదం తప్పింది!

14 Jul, 2017 03:54 IST|Sakshi
ప్రమాదం తప్పింది!

ఉర్లాం స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌
♦  ఖనాకు ఢీకొని నిలిచిపోయిన ఇంజిన్‌
ప్రమాదంపై స్పష్టత ఇవ్వని అధికారులు


నరసన్నపేట: ఉర్లాం రైల్వేస్టేషన్‌ సమీపంలో దాసరివానిపేట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి పలాస వైపు ఐరన్‌ ప్లేట్లతో వెళ్తున్న గూడ్స్‌రైలు పట్టాలు తప్పి.. పక్కనే ఉన్న వంశధార నీరుపారే కాలువకు చెందిన ఖానాకు తగిలి నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రైలు ఇంజిన్‌తోపాటు కింద భాగంలో విలువైన పరికరాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంపై సంబంధిత అధికారులు మాత్రం  స్పష్టత ఇవ్వడం లేదు.

 బుధవారం రాత్రి 11.20 గంటల సమయంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి.. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తున్నట్టు సమాచారం రావడంతో విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న గూడ్స్‌ను 10.45 గంటల సమయంలో ఉర్లాం స్టేషన్‌ సమీపంలోని నాలుగు లైన్‌లో డ్రైవర్‌ నిలిపివేశాడు. అనంతరం 11.20 గంటల సమయంలో గూడ్స్‌ బయలుదేరుతుండగా సాంకేతిక లోపంతో ఇంజిన్‌ పట్టాలు తప్పింది. వెంటనే స్టేషన్‌లో ఉన్న సిగ్నల్‌ వ్యవస్థలో రెడ్‌ లైట్‌ వెలగడంతో స్టేషన్‌ మాస్టర్‌ మోహనరావు  అప్రమత్తమయ్యారు. సిబ్బందిని పంపి పరిశీలించే సరికి రైలు ఇంజిన్‌ గెడ్డ ఖనాకు ఢీకొని నిలిచిపోవడాన్ని గుర్తించారు.

ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేశారు. ప్రమాదంపై తొలుత  అంతా ఆందోళన చెందారు. అయితే ప్రధాన ట్రాక్‌కు ఎటువంటి నష్టం వాటిళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏడీఆర్‌ఎం, ఓఏఎం, డీటీఐలతోపాటు పలువురు అధికారులు వచ్చి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పట్టాలు తప్పిన గూడ్స్‌ ఇంజిన్‌ను విడిచి పెట్టి లోడ్‌తో ఉన్న మిగిలిన పెట్టెలను గురువారం వేకువజామున నాలుగు గంటల సమయంలో వేరే ఇంజిన్‌ సాయంతో ఇక్కడ నుంచి పంపించారు.

భిన్నాభిప్రాయాలు..
ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి సాంకేతిక లోపమని అధికారులు చెబుతున్నప్పటికీ  ఇది ఎంతవరకూ వాస్తవం అనేది తేలాల్సి ఉంది. లూప్‌ లైన్‌లో 10.45 గంటల నుంచి ఉన్న గూడ్స్‌ ఒక్కసారిగా 11.20 గంటల సమయంలో ముందుకు కదిలింది. ఇలా కదలడానికి గల కారణాలు తెలియరా లేదు. ప్రమాదానికి కారణాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారనే వాదన కొంతమంది నుంచి వినిపిస్తోంది.

 సిగ్నల్స్‌ ఇవ్వకుండానే డైవర్‌ నిర్లక్ష్యంగా రైలును ముందుకు తీశారని కొందరు అంటుంటే , స్టేషన్‌ మాస్టర్‌ సిగ్నల్‌ ఇచ్చి లూప్‌ ట్రాక్‌ నుంచి మెయిన్‌ ట్రాక్‌ మీదకు లైన్‌ కలపక పోవడంతో ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ప్రోపర్‌ పద్ధతి ప్రకారం డ్రైవర్‌ను రైలును నిలపక పోవడంతో దానంతట అదే ముందుకు కదిలిందని మరికొందరు అంటున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు మాత్రం ఏమీ చెప్పడం లేదు. వాస్తవాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా.. పట్టలు తప్పిన గూడ్స్‌ ఇంజిన్‌ను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు