తప్పిన ‘పెథాయ్‌’ ముప్పు

18 Dec, 2018 02:01 IST|Sakshi
తుపాన్‌ తీరం దాటే సమయంలో విశాఖ తీరంలో ఎగసిపడుతున్న అలలు

మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడ–యానాం మధ్య తీరం దాటిన తుపాను.. ఆ తర్వాత దిశను మార్చుకుని మళ్లీ సముద్రంలోకి..

రాత్రి 7.30–8.30 మధ్యలో తుని సమీపంలో మరోసారి తీరం దాటిన వైనం

బలహీనపడి ఒడిశా వైపు పయనంఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు

‘తూర్పు’న పలుచోట్ల నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, సెల్‌టవర్లు

‘పశ్చిమ’లో వెయ్యి గొర్రెలు మృతి..9.37లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం

సహాయక చర్యల్లో తూర్పు నౌకాదళం 

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ, ఏలూరు/విశాఖ సిటీ: కోస్తాంధ్రకు పెథాయ్‌ ముప్పు తప్పింది. ఊహించిన దానికంటే ఈ తుపాను తీవ్రత చాలా తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ తుపానువల్ల గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తాయని రెండు మూడు రోజులుగా హెచ్చరికలు జారీ చేయడంతోపాటు రెండు నెలల క్రితం సంభవించిన తిత్లీ తుపాను తరహాలో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని జనం ఊహించుకుని భయపడ్డారు. అయితే, తూర్పుగోదావరి జిల్లా యానాం–కాకినాడ మధ్య సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు తుపాను తీరం దాటగా.. అంతకుముందు 12.25 గంటలకు తాళ్లరేవు–కాట్రేనికోన మధ్య తీరాన్ని తాకిన తుపాను తీరం దాటేలోపు బలహీనపడిపోయింది.

తీరం దాటిన తర్వాత తదుపరి కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలహీనపడి దిశను మార్చుకుని మళ్లీ బంగాళాఖాతంలోకి మళ్లింది. అలా 11కి.మీ. వేగంతో కదులుతూ తుని వద్ద రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్యలో మరోసారి తీరం దాటింది. అనంతరం క్రమంగా వాయుగుండం, ఆపై అల్పపీడనంగా బలహీనపడుతూ ఒడిశా వైపు పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో కోస్తాంధ్రకు పెథాయ్‌ గండం తప్పినట్టయింది. అంతకుముందు, గడచిన మూడు రోజులుగా పెనుగాలుల వేగం గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించగా తుపాను తీరానికి వచ్చేసరికే బలహీనపడడంతో ఆ వేగం 50–70 కి.మీ. మించలేదని అధికారులు అంటున్నారు. 

చలిగాలులకు 26మంది బలి
మరోవైపు.. చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 26మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలో మేతకు వెళ్లిన సుమారు వెయ్యి గొర్రెలు కూడా చలికి తట్టుకోలేక చనిపోయాయి. అలాగే, తీరం దాటే ముందు కురిసిన కుండపోత వర్షానికి, ఈదురుగాలులకు కోస్తాంధ్ర జిల్లాలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, సెల్‌టవర్లు నేలకొరిగాయి. చెట్లు విరిగిపడి పలు వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నిచోట్ల పూరిళ్లు, రేకుల షెడ్లు నేలకూలాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్నిచోట్ల బస్సులు, రైళ్లు, రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఆదివారం రాత్రి నుంచి ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. కాగా, తుపానుగా ఒకసారి, తీవ్ర వాయుగుండంగా మరోసారి తీరం దాటిన తూర్పుగోదావరి జిల్లాలోనే నష్టం తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

భారీ వర్షం కురిసిన సమయంలో పెనుగాలులు వీచి ఉంటే ఆస్తినష్టం బాగా సంభవించేందని, అలాగే.. రైతులు కూడా కోలుకోలేని విధంగా దిబ్బతినేవారు. తుపాను ప్రభావం ఊహించినదానికంటే తక్కువగా ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ప్రకటించడం గమనార్హం. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీర గ్రామాలు వేములదీవి, తూర్పుతాళ్లు, దర్భరేవు, పెదమైనవానిలంక, చినమైనవానిలంక, పేరుపాలెం, కేపీపాలెం గ్రామాల్లో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి, సుమారు 500 కుటుంబాల వారిని తరలించారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలో 30 వేల మందికిపైగా తుపాను బాధితులుండగా, అంతమందికి ఆరు తరగతి గదులున్న ఎనిమిది పాఠశాలలనే అధికారులు పునరావాస కేంద్రాలుగా ఏర్పాటుచేశారు. దీంతో వారు నానా అవస్థలుపడుతున్నారు. మరోపక్క కరెంటు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి వసతులు కూడా కల్పించలేదు. అధికారులు తమవద్ద పేర్లు నమోదు చేసుకున్నవారికి మాత్రమే భోజనాలు పెట్టడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 
గుంటూరు జిల్లా చుండూరులో నీట మునిగిన వరి ఓదెలు   

9.37లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం
భారీ వర్షాలవల్ల తుపాను ప్రభావిత జిల్లాల్లో వరి, అరటి, మొక్కజొన్న, పత్తి, పొగాకు, మిర్చి, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ‘ఖరీఫ్, రబీకి సంబంధించి మొత్తం 9.37 లక్షల హెక్టార్లలో ప్రస్తుతం పంటలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం వరకూ అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 10,866 హెక్టార్లలో వరి పంట కొంత దెబ్బతింది. మరో 1,211 హెక్టార్ల వరి నీట మునిగి ఉంది. 5,857 హెక్టార్లలో వరి పడిపోయింది. 14,982 హెక్టార్లలో కోత కోసి పొలంపైనే ఉంది. ఇవి కాకుండా 596 హెక్టార్లలో పొగాకు దెబ్బతింది. 3,988 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. ఇంకా భారీ వర్షాలు కురిస్తే పంట నష్టం పెరిగే అవకాశం ఉంది’ అని వ్యవసాయ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. పెనుగాలులు తీవ్రంగా లేకపోవడంతో కొబ్బరి, అరటి, మామిడి, ఇతర తోటలకు ముప్పు తప్పింది. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం మండలానికొక ఐఏఎస్‌ అధికారిని స్పెషలాఫీసరుగా నియమించింది.

విశాఖపట్నం జిల్లాకు కూడా కొందరిని నియమించింది. వెంటనే వారిని ఆయా మండలాల్లో బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ తరపున విపత్తు నిర్వహణ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. మరోవైపు.. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే  సుమారు రూ.33కోట్ల మేర వరి పంటకు నష్టం వాటిల్లింది. 50వేల ఎకరాల్లో వేసిన రబీ నారుమళ్లు దెబ్బతిన్నాయి. ఇక్కడ మళ్లీ నారుమళ్లు తిరిగి వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. లక్ష ఎకరాలకు పైగా నారుమళ్లు నీట మునిగాయి. 19,390 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. చేతికందే సమయంలో భారీ వర్షం పడటంతో రూ.6 కోట్ల విలువైన పత్తి తుడుచు పెట్టుకుపోయింది. 817 హెక్టార్లలోని ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 2 వేల హెక్టార్లలో రూ.2 కోట్లు విలువైన పొగాకు పంటకు నష్టం చేకూరింది. కాగా, కాకినాడ పోర్టులో ఎగుమతులు, దిగుమతుల కోసం వేచి ఉన్న 15 నౌకలకు అంతరాయం ఏర్పడింది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వర్గాల అంచనా ప్రకారం ఇక్కడ రూ.కోటి 50లక్షల నష్టం వాటిల్లింది. లారీలు నిలిచిపోవడంతో కోటిన్నర, రోజంతా గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రూ.10 కోట్ల వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. అలాగే, సోమవారం రోజంతా జిల్లాలో థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు,  రద్దుతో దాదాపు రూ.కోటి మేర ఆదాయానికి బ్రేక్‌ పడింది.

మరో 24 గంటలు విస్తారంగా వర్షాలు
ఇదిలా ఉంటే.. మరో 24 గంటలపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా వైపు వాయుగుండం పయనించినందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరీ ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా, తుపాను కారణంగా మొత్తం 107 కేంద్రాల్లో 6సెం.మీ. వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2121.8మి.మీల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లా నిన్నిమమీదివలసలో అత్యధికంగా 15.6 సెం.మీ. వర్షంపాతం రికార్డయింది. విజయనగరం జిల్లా పాచిపెంటలో 13.6, ఎండాడలో 12.5, జోగవానిపాలెం (విశాఖ జిల్లా) 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయవాడలోనూ సోమవారం రోజంతా వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో తూర్పు గోదావరి జిల్లాలో తీరప్రాంతం కిలోమీటర్ల మేర కోతకు గురైంది. దీంతో కాకినాడ బీచ్‌రోడ్డు దెబ్బతింది. తుని దగ్గరి నుంచి అల్లవరం వరకు తీరం భయానకంగా మారింది.

‘తూర్పు’లో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు 250
ఇదిలా ఉంటే.. సోమవారం తెల్లవారుజాము నుంచి వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలకు జిల్లాలోని పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 250 విద్యుత్‌ స్తంభాలు, 70 చెట్లు పడిపోయాయి. మరో 17 ఇళ్లు కూలిపోయాయి. ఈ లెక్క మరింత పెరగనుందని భావిస్తున్నారు. జిల్లాలో 12 మండలాల పరిధిలోని 20 సబ్‌స్టేషన్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. రెండు కిలోమీటర్ల మేర కేబుళ్లు తెగిపడ్డాయి. అధికారిక సమాచారం ప్రకారం 96 గ్రామాలకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. సెల్‌టవర్లు కూడా పలుచోట్ల నేలకొరిగాయి. కాగా, ఆదివారం రాత్రికే ముందస్తుగా సరఫరా నిలిపివేసిన అధికారులు ఉదయానికి గాలులు, వర్షం తీవ్రత పెరగడంతో విద్యుత్‌ స్తంభాలు, లైన్లు, ఫీడర్లు దెబ్బతిన్నాయి.  

సహాయక చర్యల్లో నౌకాదళం
పెథాయ్‌ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి ఐఎన్‌ఎస్‌ జ్యోతి, ఐఎన్‌ఎస్‌ శక్తి యుద్ధ నౌకలు, యూహెచ్‌ 3హెచ్‌ హెలికాఫ్టర్, జెమినీ బోట్లు కాకినాడకు బయలుదేరాయి. రిలీఫ్‌ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేందుకు పూర్తిస్థాయి సరంజామాతో నౌకల్ని పంపించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. వైద్య సహాయక బృందాలతో పాటు రెస్క్యూ బృందాలు, 18 మంది గజ ఈతగాళ్లు ఈ నౌకల్లో వెళ్తున్నారు. సహాయక సామాగ్రితో పాటు ఆహారం, తక్షణ పునరావాసం కల్పించేందుకు టెంట్‌లు, దుస్తులు, మందులు, దుప్పట్లను నౌకాదళం బాధిత ప్రాంతాల ప్రజలకు అందించనుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసేందుకు ఐఎన్‌ఎస్‌ డేగాలో నేవల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిద్ధంగా ఉంచినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వివరించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ – తాళ్లరేవు రోడ్డులో తుపాను గాలులకు  ఊగిపోతున్న కొబ్బరి చెట్లు  

మరిన్ని వార్తలు