గాడి తప్పిన పాడి

24 Jun, 2014 00:31 IST|Sakshi
గాడి తప్పిన పాడి

సగానికి పడిపోయిన పాల ఉత్పత్తి
పొలాల్లోనూ పశువులకు పచ్చగడ్డి కరవు
పోషణ భారమై సంతలకు తరలిస్తున్న రైతులు
పాలధర ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు కాని వైనం
తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న పశుపోషకులు
{పభుత్వం ఆదుకోకపోతే మరింత నష్టపోయే ప్రమాదంగ

 
పాడిని నమ్మినవాడు.. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు అనే పెద్దల నానుడి. కానీ రానురాను కాలం మారుతోంది. రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. కనుచూపు మేరలో చినుకు జాడ కనిపించ డం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొలాల్లో పశువులు మేసేందుకు కూడా పచ్చగడ్డి కరువైంది. ఫలితంగా పాల ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. ప్రభుత్వం నుంచి చేయూత కొరవడటంతో పాడి పరిశ్రమ కుదేలైంది.
 
నూజెండ్ల:
పంటలు లేని సమయాల్లో సాధారణంగా రైతులు వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు పాడికి కూడా అనుకూలించక రైతులు నష్టాల బారిన పడుతున్నారు. లక్షలు వెచ్చించి గేదెలను కొనుగోలు చేసిన పాల ఉత్పత్తిదారుల ఇబ్బందులు చెప్పనలవి కావటం లేదు. పచ్చగడ్డి పెంచేందుకు నీరు లేదు. కొన్ని ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు, పశుగ్రాసం కోసం సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. ఎండుగడ్డి కొందామంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చేసేది లేక రైతులు గేదెలను పొలాల మీదకు వదిలేస్తున్నారు. పొలాల్లో కూడా గడ్డి దొరకక పశువులు అలమటిస్తున్నాయి. పోషణ భారమై సంతలకు తర లించాల్సి పరిస్థితులు దాపురించాయి.

పాల ఉత్పత్తిలో నూజెండ్ల ప్రథమం..

నూజెండ్ల మండలానికి పాడి పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో అత్యధికంగా పాల ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతుంది. మండలంలో గేదెలు, ఆవులు కలపి 37,640వరకూ ఉన్నాయి. మండలంలో మూడు ప్రయివేటు డెయిరీలు నడుస్తున్నాయి. ఈ డెయిరీలు గతంలో ఇదే సీజన్‌లో రోజుకు 25 వేల లీటర్లు పాలను  సేకరించేవి. అలాగే మరో ఐదు ప్రయివేటు డెయిరీలు 15 వేల లీటర్లకు పైగా పాలను సేకరించేవి. ఇవి కాక పలు గ్రామాల్లో సంగం డెయిరీ పాల సేకరణ కేంద్రాలూ ఉన్నాయి. మండలంలోని గాంధీనగరం, కంభపాడు, ములకలూరు, వి.అప్పాపురం, పమిడిపాడు తదితర గ్రామాల్లో పాడి పరిశ్రమ ఆధారంగా జీవించే వారు అధికం. మొత్తమ్మీద 30 వేల లీటర్లకు పైగా పాలను ఒక్క నూజెండ్ల మండలంలో ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఈ ఏడాది పాల ఉత్పత్తి సగానికి పడిపోయింది.

ధర పెరిగినా గిట్టుబాటేది..?

పాలధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఏమాత్రం గిట్టుబాటు కావటంలేదని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదిలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర రూ. 42 ఉండగా ఈ ఏడాది రూ. 50కి చేరింది. అయినా ఉత్పత్తి సగానికి పడిపోయిన పరిస్థితుల్లో పెరిగిన ఎండుగడ్డి, దాణా ధరలతో పోల్చితే గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతకు మేతకూడా లభించక ఎనిమిది లీటర్ల పాలిచ్చే గేదెలు నాలుగు లీటర్లు కూడా ఇవ్వటం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం ఆదుకోకపోతే పశుపోషణకు స్వస్తి పలకడం మినహా చేసేది లేదని వాపోతున్నారు.
 
మూగజీవాల ఆకలి కేకలు
 
 బెల్లంకొండ: వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వీటిని సంరక్షించలేక పెంపకందారులు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం దప్పిక తీర్చుకునేందుకు నీరు కూడా దొరక క జీవాలు మృత్యువాత పడుతున్నాయి. బెల్లంకొండ మండలంలో ఎనిమిది వేలకుపైగా ఆవులు, గేదెలు, 1.3 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అధికారుల అంచనా. నాగిరెడ్డిపాలెం, వన్నాయపాలెం, నందిరాజుపాలెం, మన్నెసుల్తాన్‌పాలెం, పాపాయపాలెం, చండ్రాజుపాలెం, గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఆవులు, గేదెలు, జీవాలను పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సమీపంలో పచ్చగడ్డి లభించక పోవడంతో రైతులు ఒకటి, రెండు పశువులను ఉంచుకొని మిగిలిన వాటిని కబేళాకు తరలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారాలు అందటంలేదని, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మూగజీవాలను కాపాడాలని పశుపోషకులు కోరుతున్నారు. పశుసంవర్ధక కేంద్రాల్లో జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, అసలే వర్షాలు లేక అల్లాడుతుంటే తాము ఈ విత్తనాలను ఏం చేసుకోవాలో అర్థం కావటం లేదని అధికారుల తీరును నిరసిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు