క్షిపణి ప్రయోగ కేంద్రానికి మోక్షం

19 Aug, 2019 11:30 IST|Sakshi

ఈనెల 26న శంకుస్థాపన ?

కలెక్టర్, డీఆర్‌డీఓ అధికారుల పరిశీలన

సాకారం కానున్న దివి తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల

289హెక్టార్ల భూమిలో వెయ్యికోట్లతో డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌

కేంద్ర ప్రభుత్వ సాగరమాల ద్వారా తీరప్రాంత భవిష్యత్‌ మార్గాలు?

సాక్షి, నాగాయలంక(అవనిగడ్డ): కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద సముద్రతీరంలో కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రక్షణ కేంద్రానికి అవరోధాలు తొలగిపోయాయి.  289 హెక్టార్లలో వెయ్యి కోట్ల వ్యయంతో డీఆర్‌డీవో నెలకొల్పనున్న గుల్లలమోద (నాగాయలంక) మిస్సైల్‌ లాంచింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు  ఈనెల చివరి వారంలో  శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌ ఆదివారం నాగాయలంకలో పర్యటించి డీఆర్‌డీవో అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈనెల 26న రక్షణ కేంద్రానికి శంకుస్థాపన?
రక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈనెల 26న శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమం కోసం  కలెక్టర్‌ ఎండీ ఇంతియాజ్‌ ఆదివారం నాగాయలంకలో అకస్మిక పర్యటన చేశారు.  డీఆర్‌డీవో అధికారులు లెప్టినెంట్‌ కల్నల్‌ తిమ్మయ్య, బందరు ఆర్డీవో ఉదయభాస్కర్‌తో కలిసి ఆయన నాగాయలంకలో పర్యటించారు.  దేశరక్షణశాఖకు చెందిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపనకు కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ నాగాయలంకకు రానున్నట్టు అధికారులు చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి పర్యటన కోసం నాగాయంలక సమీపంలోని వక్కపట్లవారిపాలెం ఓఎన్‌జీసీ హెలీపాడ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు, అనంతరం బహిరంగసభ కోసం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణ, గుల్లలమోద గ్రామంలో స్థలాలను అధికారులు పరిశీలించారు. అయితే శంకుస్థాపన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు.

సాకారం కానున్న దివి తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల
దివిసీమ తీరప్రాంత ప్రజల అభివృద్ధి కల సాకరం కానుండటంతో  హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ఈప్రాజెక్టకు  కీలకమైన క్లియరెన్స్‌ చేయడంలో గత ఏడాది ఆగస్టులో అప్పటి కేంద్రప్రభుత్వ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ సతీష్‌రెడ్డి, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ కమిషనర్‌ డాక్టర్‌ అర్జా శ్రీకాంత్‌ అనుమతుల పరంగా చేసిన విశేష కృషి చేశారు. అనుమతుల్లో అతికీలకమైన సుప్రీంకోర్టు క్లియరెన్స్, కేంద్రఅటవీశాఖ అనుమతులు, అమెండ్‌మెంట్‌ టూ సీఆర్‌జెడ్‌ రెగ్యులేషన్‌తో పాటు ఎన్విరాన్‌ మెంట్‌ క్లియరెన్స్‌ లాంటివి ఈనెల మొదటివారంలో పూర్తయ్యాయి. ఈ రక్షణ కేంద్రానికి ఆరేళ్లుగా  డీఆర్‌డీవో అధికారులు, అటవీశాఖ అత్యున్నత అధికారులు గుల్లలమోద, లైట్‌హౌస్‌ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి అవసరమైన వనరుల పరిస్థితిని అధ్యయనం చేశారు. సముద్రతీరంలో గాలివేగం, అత్యాధునిక సాయిల్‌ టెస్ట్‌లు ముగించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు తొలుత ఆటంకాలుగా ఉన్న  అటవీశాఖ, రెవెన్యూవర్గాల ఒప్పందాలు క్లియర్‌ కావడంతో ప్రాజెక్ట్‌కు అవసరమై కేటాయించిన 381ఎకరాల భూమి అటవీశాఖ కింద ఉండటంతో పరస్పర భూముల అప్పగింత కార్యక్రమం రెండేళ్ల క్రితం పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూములకు 112మంది రైతులకు రూ.5కోట్ల పైచిలుకు పరిహారాన్ని 2018లో క్లియర్‌ చేశారు.

సాగరమాల పథకంద్వారా తీరప్రాంత భవిష్యత్‌ మార్గాలు?
గుల్లలమోద(నాగాయలంక)క్షిపణి ప్రయోగకేంద్రం నేపథ్యంలో కేంద్రప్రభుత్వ సాగరమాల పథకంద్వారా తీరప్రాంత ప్రధాన రహదారులన్నీ నాలుగు లేన్ల మార్గాలవుతాయని అంటున్నారు.  పులిగడ్డ నుంచి నుంచి గుల్లలమోద వరకు, కోడూరుమండలంలో నూతనంగా నిర్మితమైన   ఉల్లిపాలెం–మచిలీపట్నం వంతెన నుంచి గుల్లలమోద వరకు సాగరమాల కింద  భవిష్యత్‌మార్గాలు ఏర్పడనున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు.  ప్రాజెక్టు పనులు మొదలయితే వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కలగనుంది. దేశంలో రూపొందించే రెండో మిస్సైల్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ సెంటర్‌ ఇదే కావడంతో కృష్ణాజిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఒడిస్సా రాష్ట్రం లోని బాలాసూర్‌ ధీటుగా ఇక్కడి ప్రాజెక్ట్‌ నిర్మాణం కానుందని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌ పర్యటనలో మండల స్పెషలాఫీసర్‌ రామభార్గవి,  తహశీల్దార్‌ ఎం.వెంకట్రామయ్య , ఈఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌తో కృష్ణాజిల్లాకు గుర్తింపు
డీఆర్‌డీఓ ప్రాజెక్ట్‌ ఏర్పాటుతో కృష్ణా జిల్లాకు ప్రపంచపటంలో గుర్తింపు దక్కనుంది. ముఖ్యంగా దివిసీమ తీర ప్రాంతవాసులు కల త్వరలో సాకారం కానుంది. ప్రధానమైన అనుమతులు పూర్తయి త్వరలో ప్రధాని శ్రీకారం చుట్టబోవడం సంతోషం. డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌   సతీష్‌రెడ్డి,  ఇతర కేంద్ర ప్రభుత్వశాఖల ఉన్నతవర్గాల కృషి ఫలించింది. 
– డాక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో 
 

మరిన్ని వార్తలు