అమ్మా.. ఎక్కడున్నావు తల్లీ

20 Jul, 2018 08:14 IST|Sakshi

గోదావరిలో గల్లంతైన విద్యార్ధినుల తల్లిదండ్రుల ఆవేదన

బిడ్డలకోసం వేయికళ్లతో ఎదురుచూపు

ఇంకా కానరాని ముగ్గురు బాలికల ఆచూకీ

సాక్షి, ముమ్మిడివరం : అమ్మా.. ఎక్కడున్నావు తల్లీ అని రోదిస్తూ గోదారి గట్టున తమ బిడ్డల ఆచూకి కోసం నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రుల వేదన చూపరులను కలచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలో గోదావరి నదిలో పిల్లలు గల్లంతై ఆరు రోజులు గడచినా ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మృతదేహాలు లభ్యమైనవారి రోదన ఒకవైపు, ఆచూకీ తెలియని విద్యార్థినుల కుటుంబ సభ్యుల వేదన మరోవైపు.. లంక గ్రామాల్లో అలముకున్న హృదయ విదారక దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద ఈ నెల 14న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థినులు, ఒక వివాహిత గల్లంతైన విషయం తెలిసిందే. ఐదు రోజులు ముమ్మర గాలింపు చర్యల చేపట్టగా ముగ్గురు విద్యార్థినులతో పాటు ఓ వివాహిత మృత దేహం లభ్యమయ్యాయి. మరో ముగ్గురు బాలికల ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన విద్యార్థినులు కొండేపూడి రమ్య, పోలిశెట్టి అనూష, సుచిత్రల ఆచూకీ తెలియాల్సి ఉంది.

 
ఒకే కుటుంబానికి చెందిన అనూష, సుచిత్ర ఆచూకీ తెలియక వారి తల్లిదండ్రులు పోలిశెట్టి మాచరయ్య, వీరవేణి బోరున విలపిస్తున్నారు. మాచరయ్య వీరవేణికి ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె అనూష చదువులో çమంచి మార్కులు తెచ్చుకుంటూ వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేది. రెండో కుమార్తె సుచిత్ర. మాచరయ్య మూడో కుమార్తె కనక మహాలక్ష్మి తన అక్కలకు ఏమైందో తెలియక బిక్కుబిక్కుమంటూ ఇంట్లో గడుపుతోంది. కొండేపూడి రమేష్‌కుమార్, దుర్గలకు నలుగురు కుమార్తెలు కాగా గల్లంతైన రమ్య నాలుగో కుమార్తె. తండ్రి ఆర్కెష్ట్రాలో పని చేస్తుండటంతో రమ్య పాటలు పాడుతూ ఉండేది. అందరితో కలిసి మెలిసి ఉండే రమ్య దూరం కావడంతో ఆ కుటుంబం దుఖఃసాగరంలో మునిగిపోయింది. ఆరో రోజు కూడా ప్రత్యేక బృందాలు గోదావరి తీరంలో గాలింపు చర్యలు చేపట్టాయి. మత్య్సకారులు మర పడవలపై గాలింపు నిర్వహిస్తున్నారు.

బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ రూ.3.50 లక్షల సాయం
ఐ.పోలవరం: పడవ ప్రమాదంలో మృతిచెందిన, గల్లంతైన వారి కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ తమ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు చొప్పున ఏడు కుటుంబాలకు రూ.3.50 లక్షలు ఆర్థికసాయం అందించింది. గురువారం  ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, వైఎస్సార్‌ సీపీ ముమ్మిడివరం, రామచంద్రాపురం కోఆర్డినేటర్లు పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్, చెల్లుబోయిన వేణు పశువుల్లంక రేవు దాటి లంక గ్రామాలైన సలాదివారిపాలెం, శేరులంకలకు  వెళ్లి ఏడు కుటుంబాలకు సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బోస్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఏడు కుటుంబాలకు రూ.3.50 లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు