తప్పుల తడకగా ఓటరు జాబితా!

26 Jan, 2019 13:59 IST|Sakshi
జాబితాలో తొలగించిన కరిముల్లా ఓటు

అర్హత జాబితాలో మరణించిన వారి ఓట్లు

బతికున్న వారి ఓట్లు గల్లంతు

ఓటర్ల సర్వేపై సర్వత్రా విమర్శలు

గుంటూరు. పిడుగురాళ్ల: ఎన్నికల అధికారులు ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆసాంతం తప్పుల తడకగా ఉంది. జాబితాలో అర్హుల లిస్టులో మరణించిన వారి ఓట్లు ఉండడం ఒక విశేషమైతే, బతికున్న పలువురి ఓట్లు గల్లంతుకావడం గమనార్హం. స్థానికంగా ఉంటున్న వారి ఓట్లను అసలు గ్రామంలోనే లేనట్లుగా తొలగింపుల జాబితాలో చేర్చారు. ఒక్క పిడుగురాళ్ల పట్టణంలోనే సుమారు వెయ్యికి పైగా ఓట్లు ఓటర్ల జాబితాలో తొలగింపులు జరిగాయని తెలుస్తోంది. తప్పుల తడక జాబితాపై ప్రజలు మండిపడుతున్నారు.

పిడుగురాళ్ళ పట్టణంలోని 30 వార్డుల్లో వేలాది ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు లబోదిబోమంటున్నారు. ఆయా బూత్‌ల కన్వీనర్లు బూత్‌ల వారీగా జాబితాలను పరిశీలిస్తుంటే ఒక్కో బూత్‌లో వందల సంఖ్యలో ఓట్లు గల్లంతవడంతో పాటు తప్పులు దొర్లినట్టు గుర్తించారు. 28వ వార్డులోని 293 బూత్‌లో వరుసగా 50 మంది ఓట్లను తొలగించారు. వారంతా స్థానికంగా ఏళ్ల తరబడి ఇక్కడే నివశిస్తున్నారు. షేక్‌ మాబుసుభాని(ఎల్‌హెచ్‌ఎల్‌1886209) అనే వ్యక్తి, సయ్యద్‌ నాగవరం సైదా(ఏపీ171060597035) మరణించినా, వారు జీవించి ఉన్నట్లుగా వారి ఓట్లు జాబితాలో క్షేమంగా ఉన్నాయి. వీరి ఓట్లు 293వ బూత్‌ నంబర్‌లో ఉన్నాయి. స్థానికంగా నివాసముంటున్న షేక్‌ హోటల్‌ కరిముల్లాతో పాటు సయ్యద్‌ జాన్‌బీ, షేక్‌ మస్తాన్‌వలి ఇలా సుమారు 50 మంది వరకు మైనార్టీల ఓట్లు గల్లంతయ్యాయి.

నా ఓటు తొలగింపురాజకీయ కుట్రే
గత నాలుగు ఎన్నికల్లో ఓటు వేశాను. మొన్న సర్వేలో కూడా నా ఓటు ఉంది. ఇప్పుడు ఫైనల్‌ లిస్టులో నా ఓటు లేకపోవడం కేవలం రాజకీయ కుట్రే. నేను వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడనని తొలగించి ఉంటారు. ఇటీవలే సామాజిక సర్వే అంటూ ప్రభుత్వంపై అభిప్రాయం అడిగితే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశాను. అందుకే నా ఓటు తొలగించి ఉంటారు.    –షేక్‌ కరిముల్లా, 203 బూత్‌ నంబర్, పిడుగురాళ్ల

40 ఏళ్ల నుంచిఓటు వేస్తున్నా..
గత 40 ఏళ్ల నుంచి నేను ఓటు వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా ఓటు తీసేశారు. సర్వే చేసేవారు సక్రమంగా చేయకుండా ఇలా మా లాంటి వారిని ఇబ్బంది పెట్టడం తగదు.    –సయ్యద్‌ జాన్‌బీ,పాటిగుంతల, పిడుగురాళ్ల

మరిన్ని వార్తలు