తప్పులతో ప్రచార బెలూన్లు...ఫ్లెక్సీలు 

16 Aug, 2018 11:49 IST|Sakshi
నాగావళికి బదులుగా (నాగవళి) తప్పుగా ముంద్రించిన బెలూన్లు శ్రీకాకుళంకి బదులు (శ్రీకాకులం), దినోత్సవకి బదులుగా (దిననోత్సవ) గా ముద్రింపు 

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న 72వ స్వాతంత్య్ర దినోత్సవంలో పలు లోపాలు బహిర్గతమయ్యాయి. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుక కోసం 20 రోజులుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అన్ని రకాలు సామగ్రిని గత స్వాతంత్య్ర వేడుకలో అనుభవం ఉన్న వారికే టెండర్లు ఇచ్చి అమరావతి నుంచి రప్పించారు.

అయినప్పటికీ చివరికి తప్పులు తడకల బెలూన్లు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అందులో ప్రధానంగా వంశధార– నాగావళి అనే పేర్లకు బదులు (నాగవళి) అని, ఏకంగా జిల్లా పేరును శ్రీకాకుళంకి బదులుగా (శ్రీకాకులం) అని స్వాతంత్య్ర దినోత్సవం బదులుగా (దిననోత్సవ) వేడుకలు అని ముద్రించడం విశేషం. 

పరేడ్‌ మైదానంలో కుక్కల హడావిడి:

ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోకి వచ్చే మీడియా ప్రతినిధులకు, సామాన్యులకు లోపలికి పంపించేందుకు పోలీసులు హడావిడి చేసి నానా ఇబ్బందులకు గురిచేశారు. ఎంతమంది పోలీసులు చుట్టూ కాపలా కాసిన వీధికుక్కలు మాత్రం నేరుగా పరేడ్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాయి. మనుషులను మాత్రం బెదిరించగలిగారే తప్పా వీటిని మాత్రం ఏమి చేయలేక చేతులెత్తేశారు. 

స్వాతంత్య్ర సమరయోధులను పట్టించుకోని వైనం

స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను ఏటా పిలిచి గౌరవించడం జిల్లా సాంప్రదాయం. ఈ సారి సీఎం చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చిన సందర్భంగా వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం కొనసాగినంత సేపు ఓపికగా కూర్చున్నారు. సీఎం వెళ్లిన తక్షణమే ఎవరిమానాన వారు వారిని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బయటివారిని తోడుగా పిలిచుకుని వెళ్లారు. 

ప్రేక్షకుల నిరుత్సాహం:

జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవానికి ఏటా కుటుంబ సభ్యులతో హాజరవ్వడం ఆనవాయితీ. అదేవిధంగా చాలా మంది జోరు వానను సైతం లెక్కచేయకుండా మైదానం వరకు వచ్చినా లోపలికి పంపించకుండా పోలీసులు తిరిగి పంపించేశారు. దీంతో వారంతా నిరుత్సాహం చెందారు.

మరిన్ని వార్తలు