రోడ్డెక్కిన విభేదాలు

19 Nov, 2013 06:17 IST|Sakshi

సాక్షి, నెల్లూరు:  రోడ్లు, భవనాల శాఖలోని అధికారుల మధ్య నెలకొన్న వర్గవిభేదాలు ఒక్కసారిగా రోడ్డునపడ్డాయి. అధికారుల అండతో కొందరు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఏళ్ల తరబడి బదిలీ కాకుండా ఒకే చోట మకాం వేయడాన్ని మరోవర్గం వారు జీర్ణించుకోలేకపోయారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ)కి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆర్‌అండ్‌బీ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్‌ఈ(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) వివేకానందరెడ్డి సోమవారం ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో విచారణ చేపట్టడంతో విభేదాల గుట్టురట్టయింది.  
 ఏళ్ల తరబడి ఒకే చోట
 జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండటంతో నెల్లూరు నగరంలో ఇబ్బడిముబ్బడిగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్డు మీద రోడ్డు వేస్తుండటంతో కాంట్రాక్టర్లతో పాటు కొందరు అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కొందరు వర్క్‌ఇన్ స్పెక్టర్లు ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల అండతో ఏళ్లతరబడి నెల్లూరులోనే తిష్టవేశారు. జిల్లాలోని మూడు డివిజన్లు, 10 సబ్‌డివిజన్లలో 60 మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఉండగా వీరిలో 25 మంది నెల్లూరులోనే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. కొందరు 18 ఏళ్లుగా ఒకే చోట తిష్టవేయడం విశేషం. పలువురు ఓవైపు సొంత వ్యాపారాలు చేసుకుంటూ, మరోవైపు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు. పనుల వద్దకు వెళ్లి పర్యవేక్షించకపోవడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు కూడా పొందినట్లు ఈఎన్‌సీకి ఫిర్యాదులు
 అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొందరిని  మాత్రం ఐదేళ్లు పూర్తికాకుండానే బదిలీ చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు కొందరు ఉన్నతాధికారులే ఈ విధంగా బదిలీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 యూనియన్ల పేరుతో..
 కొందరు అధికారులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతూ మొత్తం తతంగం నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు యూనియన్ల పేరుతో, మరోవైపు అధికార పార్టీ నేతల అండతో చాలా మంది వర్క్‌ఇన్‌స్పెక్టర్లు బదిలీ చేసినా వెళ్లడం లేదని, నేతలతో ఒత్తిడి తెస్తున్నారని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులే పేర్కొంటున్నారు. మిగిలిన వారు కూడా నెల్లూరులోనే ఉండి పనుల పర్యవేక్షణకు వెళ్లడంలేదని, ఏమని అడిగితే యూనియన్ల పేరుతో బెదిరిస్తున్నారని ఓ అధికారి వాపోయారు. అధికారులే నాటకాలు ఆడుతున్నారని, తమకు అనుకూలంగా ఉండి సొంత పనులు చేసిపెట్టేవారిని ఏళ్ల తరబడి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచుతున్నారని, మిగిలిన వారిని వేధిస్తూ ఐదేళ్లు పూర్తికాకముందే అక్రమంగా బదిలీ చేస్తున్నారని ఓ వర్క్‌ఇన్‌స్పెక్టర్ ఆరోపించాడు.
 విచారణ..ఫిర్యాదుల స్వీకరణ
 అధికారులు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు గ్రూపులుగా విడిపోవడంతో ఆర్‌అండ్‌బీ శాఖలోని విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. ఓ వర్గం వారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ విభాగంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపాలంటూ క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ వివేకానందరెడ్డిని ఆదేశించింది. ఆయన క్వాలిటీ కంట్రోల్ ఈఈ మురళీకృష్ణతో కలిసి సోమవారం నెల్లూరులోని రోడ్ల భవనాల శాఖ కార్యాలయంలో  ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారణ నిర్వహించారు. జిల్లాలో వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఎక్కడ పని చేస్తున్నది? నెల్లూరు పరిధిలో ఎంత మంది పనిచేస్తున్నారు? ఎన్ని ఏళ్లుగా బదిలీ లేకుండా ఇక్కడే ఉన్నారు? అనే విషయాలపై విచారణ జరిపి వివరాలు సేకరించారు. అదే సమయంలో అధికారులపై కొందరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదులను సైతం స్వీకరించినట్లు సమాచారం. 

>
మరిన్ని వార్తలు