స్వాహా పక్కా.. తేలని లెక్క 

25 Nov, 2019 11:40 IST|Sakshi

మైక్రో వాటర్‌షెడ్లలో నిధుల దుర్వినియోగం 

మహిళలకు అందని  ‘జీవనోపాధి’ రుణాలు 

బినామీ పేర్లతో పక్కదారి 

వెలుగు, వాటర్‌షెడ్‌ సిబ్బంది, టీడీపీ నాయకుల పాత్ర 

రికవరీకి ప్రస్తుతం తంటాలు 

బేతంచెర్ల మండలం గూటుపల్లి, అంబాపురం, ఉసేనాపురం, నాగమళ్లకుంట, ఆర్‌.బుక్కాపురం, ఆర్‌ఎస్‌ రంగాపురం, రహిమాన్‌పురం గ్రామైక్య సంఘాలకు రూ.57.79 లక్షల వాటర్‌షెడ్‌ నిధులు విడుదలయ్యాయి. ఇందులో రూ.37.59 లక్షలు లబ్ధిదారులకు ఇచ్చినట్లు వెలుగు సిబ్బంది లెక్కలు చూపారు. మిగిలిన రూ.20.20 లక్షలు ఏమయ్యాయో ఎవరికీ తెలియడం లేదు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద లేవని వెలుగు సిబ్బంది అంటున్నారు. కేవలం బేతంచెర్ల మండలంలోనే కాదు.. జిల్లాలోని దాదాపు అన్ని మైక్రో వాటర్‌షెడ్‌ గ్రామాల్లోనూ ఇదే తరహా అక్రమాలు జరిగాయి. 

కోడుమూరు: వాటర్‌షెడ్‌ నిర్వాహకులు, వెలుగు సిబ్బంది, టీడీపీ నాయకులు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు. మహిళా సంఘాల లీడర్ల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని పొదుపు మహిళలకు అందాల్సిన నిధులను తమ జేబుల్లోకి వేసుకున్నారు. ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐడబ్ల్యూఎంపీ) కింద జిల్లాలోని బేతంచెర్ల, ఆళ్లగడ్డ, సి.బెళగల్, సంజామల, అవుకు, కోసిగి, తుగ్గలి, నంద్యాల, ఓర్వకల్లు, హాలహర్వి, ఆత్మకూరు, జూపాడుబంగ్లా, ఎమ్మిగనూరు మండలాల్లోని 119 మైక్రో వాటర్‌షెడ్లకు 2010 – 2013 సంవత్సరాల మధ్య దాదాపు రూ.280 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ వాటర్‌షెడ్ల కాల పరిమితి ఐదేళ్లు. 2014 నుంచి 2019 మధ్య నిధుల వినియోగం ఎక్కువగా జరిగింది. వాస్తవానికి ఈ నిధులతో నీటి సంరక్షణ కోసం వాగులు, వంకల్లో చెక్‌డ్యాంలు, నీటికత్వాలు, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర పనులు చేపట్టాలి. అలాగే వాటర్‌షెడ్ల పరిధిలోని గ్రామాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించాలి. మొత్తం నిధుల్లో తొమ్మిది శాతం మహిళల జీవనోపాధికి వెచ్చించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 280 కోట్లలో రూ.25.20 కోట్లు జీవనోపాధి కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉండగా..చాలా వరకు పక్కదారి పట్టించారు.

కుమ్మక్కై కొల్లగొట్టారు! 
మైక్రో వాటర్‌షెడ్‌ గ్రామాలకు జీవనోపాధి కింద విడుదలైన నిధులను గ్రామైక్య సంఘాల ఖాతాల్లో జమ చేశారు. పొదుపు సంఘాల్లోని మహిళలను అత్యంత నిరుపేదలు, నిరుపేదలు, పేదలుగా విభజించి, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యతిచ్చి.. చిన్నపాటి వ్యాపారాలు, పాడిగేదెలు, పొట్టేళ్ల పెంపకం కోసం రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మొత్తాన్ని వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే..పలుచోట్ల వెలుగు, వాటర్‌షెడ్‌ సిబ్బంది, టీడీపీ నాయకులు కుమ్మక్కై బినామీ పేర్లను చేర్చి నిధులు చాలావరకు పక్కదారి పట్టించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జీవనోపాధి నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు కావాలని జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో వెలుగు (ప్రస్తుతం వైఎస్సార్‌ క్రాంతి పథం) అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. అసలు తమకు రుణమే ఇవ్వలేదని కొంతమంది చెబుతుండగా, తాము తీసుకున్న అప్పు గతంలోనే చెల్లించామని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం సగం డబ్బు వెలుగు సిబ్బంది తీసుకుని, మిగిలిన మొత్తాన్ని చేతికిచ్చి ఎక్కువ రుణం తీసుకున్నట్టు సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపిస్తున్నారు. కోసిగి మండలం డి.బెళగల్‌ వాటర్‌షెడ్‌ పరిధిలోని గ్రామైక్య సంఘాలకు రూ.40.5 లక్షలు విడుదలయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.36 లక్షలు వసూలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉంది. 

అక్రమాలకు నిదర్శనాలివిగో.. 
-సి.బెళగల్‌ మండలంలోని అరుణోదయ గ్రామైక్య సంఘానికి విడుదలైన జీవనోపాధి నిధులను బినామీల పేరిట ఓ సీసీ స్థానిక టీడీపీ నేతలతో కుమ్మక్కై స్వాహా చేశారు. దాదాపు రూ.12 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. 
-కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామానికి రూ.8 లక్షలు విడుదలయ్యాయి. అప్పటి వెలుగు సిబ్బంది.. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేసుకుని.. రూ.25 వేల నుంచి రూ.40వేలు అప్పులిచ్చినట్టు పొదుపు మహిళలతో సంతకాలు పెట్టించుకున్నారు. రికవరీ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.  
-కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామైక్య సంఘానికి రూ.28 లక్షలు విడుదలయ్యాయి. టీడీపీ నేతలు, వెలుగు సిబ్బంది కుమ్మక్కై బినామీ పేర్లతో నిధులన్నీ స్వాహా చేశారు. మహాలక్ష్మి, ప్రియదర్శిని, మదార్‌ పొదుపు సంఘాల్లోని సుంకులమ్మ (రూ.45వేలు), సాలమ్మ (రూ.35వేలు), బాలవెంకటమ్మ (రూ.25వేలు) అప్పు తీసుకున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అసలు తాము అప్పే తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం రికవరీకి వెళ్లిన సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేశారు. జిల్లాలోని మిగిలిన వాటర్‌షెడ్‌ గ్రామాల్లోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. 

విచారణ చేపడతాం.. 
మైక్రో వాటర్‌షెడ్ల నిధుల వినియోగంపై విచారణ చేపడతాం. పొదుపు సంఘాల మహిళలకు జీవనోపాధి కోసం కేటాయించిన నిధులు అర్హులకు చేరాయా, లేదా అనే అంశాన్ని పరిశీలిస్తాం. ఎక్కడైనా దుర్వినియోగం అయినట్లు తేలితే చర్యలు తప్పవు.
– శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ, కర్నూలు  

మరిన్ని వార్తలు