మదర్సాల నిధులు స్వాహా

20 Jul, 2014 01:15 IST|Sakshi

సిబ్బంది విద్యార్హతలపై గందరగోళం
మార్గదర్శకాల్లో అస్పష్టత ఆసరాగా నిధుల దుర్వినియోగం
నిలిచిన జీతాలు

 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిబంధనల్లో ఉన్న అస్పష్టతను అడ్డం పెట్టుకుని రాజీవ్ విద్యామిషన్ కింద వచ్చిన నిధులను దిగమింగారు.  మైనారిటీలకు ఉర్దూలో విద్యాబోధన కోసం ఏర్పాటు చేసిన మదర్సాల పేరుతో భారీగా డబ్బులు స్వాహా చేశారు. విద్యాశాఖకు, రాజీవ్ విద్యామిషన్‌లోని ఉద్యోగులకు మధ్య డబ్బు పంపిణీలో వచ్చిన విభేదాల కారణంగా నాలుగు నెలల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
దీంతో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వచ్చిన వల్లభనేని శ్రీనివాస్ మార్చి నెల నుంచి మొత్తం అన్ని మదర్సాలకు చెల్లించే నిధులను నిలిపేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒక అదనపు కార్యదర్శిని విచారణకు ఆదేశించారు. ఆయన త్వరలో జిల్లాకు వచ్చి విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే శుక్రవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి దీనిపై పీడీ శ్రీనివాస్‌ను విచారణ చేసి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
 
వివరాల్లోకి వెళ్తే...
2012-13కు జిల్లా వ్యాప్తంగా 86 మదర్సాలుండగా, 2013-14కి వచ్చేసరికి వాటి సంఖ్య 45కి పడిపోయింది. అందులో ఒకటి రద్దు చేయగా 44 నడుస్తున్నాయి. మదర్సాల పనితీరుకు, విద్యార్హతలకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, ఒక్కోసారి ఒక్కో నిబంధన అమలు చేయడం వల్ల దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అసలు మదర్సా లేకుండానే అది నడుపుతున్నట్లు ఎంఈవోతో సర్టిఫికెట్ తెచ్చుకుని ప్రతినెలా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఒక్కో మదర్సాకు ఒక నజీమ్, మరో విద్యావలంటీర్‌ను కేటాయించారు.
 
విద్యార్హతలు బీఈడీ గానీ, డీఈడీగానీ ఉండాలి. అయితే నాలుగేళ్లుగా వాటికి మినహాయింపు ఇస్తున్నారు. దీంతో అసలు ఉర్దూ రానివారు కూడా మదర్సాల పేరుతో డబ్బులు దిగమింగేశారు. దీనిపై ఒంగోలు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(ఉర్దూ రేంజ్) తనిఖీలు నిర్వహించి రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్‌కు ఒక నివేదిక పంపారు. అందులో కొన్ని చోట్ల కనీసం మదర్సా బోర్డులు కూడా లేవని, విద్యార్థులు లేరని పేర్కొన్నారు. కొత్తపట్నం, సంతమాగులూరు, కందుకూరు, వేటపాలెం, రాచర్ల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, పొదిలితో సహా పలు మదర్సాలు కాగితాల మీదే పని చేస్తున్నాయని నివేదిక ఇచ్చారు. వారి విద్యార్హతలు కూడా బోగస్ అని, అర్హత లేనివారు పనిచేస్తున్నారని తేల్చారు.
 
అసలు పనిచేయని మదర్సాల పేరుతో డబ్బులను కొందరు అధికారులే తినేస్తున్నారని నివేదిక ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ (ఏఎల్‌ఎస్) 40 బోగస్ మదర్సాల్లో వందమందికి పైగా వలంటీర్లను నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకున్నట్లు చూపించారని పేర్కొన్నారు. నిజంగా పనిచేస్తున్న మదర్సాల నుంచి ఐదు వేల రూపాయలు, బోగస్ మదర్సాల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.
 
బోగస్ మదర్సాల్లో ఇద్దరు వలంటీర్లు ఉన్నట్లు చూపించి ఒకరి వేతనం నజీమ్, మరో వేతనం ఏఎల్‌ఎస్ తీసుకున్నట్లు తేలిందని డీఐ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే రాజీవ్ విద్యామిషన్ ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌పై అవగాహన లేక డీఐ తన నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. దీనిపై ఆరోపణలు వచ్చిన వెంటనే మొత్తం మదర్సాల వేతనాలు నిలిపేసినట్లు ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి ఆదేశాల మేరకు పదిరోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు