మిత్ర బేరం!

22 Jan, 2016 23:04 IST|Sakshi
మిత్ర బేరం!

వైద్యమిత్ర పోస్టులకు    జోరుగా బేరసారాలు
అమాత్యులను ఆశ్రయిస్తున్న ఆశావహులు
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో    అందని వైద్య సేవలు
ఆరోగ్యమిత్రల ఆందోళన    పట్టని ప్రభుత్వం
వైద్యమిత్రల నియామకానికి    నోటిఫికేషన్ జారీ

 
అనుకున్నట్లే జరుగుతోంది. అయినవారిని అందలం ఎక్కించడానికి.. అందినకాడికి దండుకోవడానికే కొత్త అర్హతల పేరుతో ఆరోగ్యమిత్రలకు సర్కారు ద్రోహం చేసింది. ఇప్పుడు జరుగుతున్న తంతు దీన్ని ధ్రువపరుస్తోంది. కొత్తగా వైద్యమిత్రల నియామకానికి అధికార పార్టీ నేతలు అప్పుడే బేరసారాలు మొదలు పెట్టేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో నియామకానికి లక్షల్లోనే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
 
విశాఖపట్నం: ఆరోగ్యమిత్రల తొలగింపుపై ఒక పక్క ఆగ్రహావేశాలు పెల్లుబుకుతుండగా.. మరోవైపు వారి స్థానంలో వైద్యమిత్రల నియామకానికి బేరసారాలు మొదలైపోయాయి.  ప్రభుత్వ నిర్దేశించిన కొత్త అర్హతలున్నవారు ఈ పోస్టుల కోసం మంత్రులు, టీడీపీ అగ్రనేతలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు నేతలు ఒక్కో పోస్టుకు రూ.లక్షకుపైగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాల ఊసే లేకుండా పోయింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు కొత్తగా భర్తీ చేయనున్న వైద్యమిత్ర పోస్టుల కోసం ఎగబడే పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ నేతలు డిమాండ్ చేసినంత సమర్పించుకోవడానికి చాలామంది నిరుద్యోగులు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు పలుకుబడి ఉన్న వారి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం శుక్రవారం వైద్యమిత్ర నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా క లెక్టర్లను ఆదేశించింది.  దీంతో వైద్యమిత్రల నియామకానికి సంబంధించిన బేరసారాలు మరింత జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.

దిగజారిన వైద్యసేవలు..
ఇలావుండగా ప్రభుత్వం తమను ఉన్న పళంగా తొలగించడంతో ఆరోగ్య మిత్రలు ఆందోళన పథంలో ఉన్నారు. ఫలితంగా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సేవలు నిలిచిపోయాయి. ఈ ఆస్పత్రుల కు వైద్యానికొచ్చే రోగులను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఆయా ఆస్పత్రుల్లోని సిబ్బందితోనే ఎన్టీఆర్ వైద్యసేవ అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా కార్యరూపం దాల్చడం లేదు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉన్న సిబ్బందికి ఎన్టీఆర్ వైద్య సేవల కార్డుల రిజిస్ట్రేషన్, ప్రాసెస్ ప్రక్రియపై అనుభవం లేకపోవడంతో వైద్యానికొచ్చే రోగుల్లో 10 శాతం మందికి మించి సేవలందని పరిస్థితి నెలకొంది. జిల్లాలోఎన్టీఆర్ వైద్య సేవ కోసం రోజుకు 500 మంది ఔట్ పేషెంట్లు, 300 మంది ఇన్ పేషెంట్లు వస్తుంటారు. ఇప్పుడు ఆ సంఖ్య పదో వంతు కూడా ఉండడం లేదు. కొన్ని నెట్‌వర్స్ ఆస్పత్రులు ఇదే అదనుగా రిజిస్ట్రేషన్లు వగైరాలకు రోగుల నుంచి వసూళ్లు మొదలు పెట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అత్యవసర కేసుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలను తొలగించినందున ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చుకోలేమని చెబుతున్నారు. అలాంటి రోగులు విధిలేక అవే ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి చేరిపోతున్నారు. మరోవైపు ప్రస్తుతం ఆరోగ్య మిత్రల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), వర్కింగ్ జర్నలిస్టుల పథకం కార్డులను చాలా నెట్‌వర్క్ ఆస్పత్రులు తిరస్కరిస్తున్నాయి. ఇలాంటి వారిలో హృద్రోగులు, ఇతర ఎమర్జెన్సీ వైద్యం అందాల్సిన రోగుల కుటుంబీకులు తమ వారిని బతికించుకునేందుకు అప్పోసప్పో చేసైనా నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చేరుస్తున్నారు.
 

మరిన్ని వార్తలు