కావాలనే మేయర్‌ను పక్కన పెట్టారా..?

8 Sep, 2017 03:01 IST|Sakshi
కావాలనే మేయర్‌ను పక్కన పెట్టారా..?

శిలాఫలకాలపై పేర్లలో లేని ప్రొటోకాల్‌
ఆహ్వాన ప్రతంలో మాత్రం పాటించిన వైనం
కమిషనర్‌పై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆగ్రహం
ఆహ్వానం ఆలస్యంపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపాటు


సాక్షి, రాజమహేంద్రవరం : నగరపాలక సంస్థలో పాలకమండలిని పక్కనపెట్టారా? ప్రొటోకాల్‌ పాటించడంలో మేయర్‌ను కావాలనే విస్మరించారా? అంటే అధికారుల చర్యలు అవుననే చెబుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు ఆహ్వాన పత్రికలు, శిలాఫలకాలు వేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నూతన భవనం, అదే ప్రాంగణంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకాల్లో నగర ప్రథమ మహిళ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు తర్వాత కాక ఆరో పేరుగా పెట్టారు.

సాధారణంగా ముఖ్యమంత్రి తర్వాత నగర ప్రథమ పౌరుడు/పౌరురాలి పేరు రాస్తారు. కానీ సీఎం పేరు తర్వాత ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కిమిడి కళా వెంకటరావు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ పేరు ప్రస్తావించిన అనంతరం ఏడో పేరుగా మేయర్‌ పంతం రజనీ శేషసాయి పేరును ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో మాత్రం సీఎం చంద్రబాబు పేరు తర్వాత సభాధ్యక్షురాలిగా మేయర్‌ పేరును పెట్టారు. తాత్కాలికంగా వేసిన ఆహ్వాన పత్రికలో ప్రొటోకాల్‌ పాటించిన యంత్రాంగం శాశ్వతంగా ఉంటే శిలాఫలకాలపై మా త్రం పాటించకపోవడం కావాలనే మేయర్‌ను పక్కనపె ట్టారా? అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

పాలనా వ్యవహారాల్లో మేయర్‌కు, కమిషనర్‌ కు మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఈ అనుమానా లకు బలం చేకూరుస్తున్నాయి. ప్రొటోకాల్‌ పాటించకపోవడంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమిషనర్‌కు ఫోన్‌చేసి మండిపడినట్లు సమాచారం. మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం తనకు ఆహ్వానం ఆలస్యంగా కార్యక్రమం రోజున పంపారని ఎస్పీ కార్యాల యం వద్ద కమిషనర్‌ వి.విజయరామరాజును నిలదీశా రు. దీనిపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తానని విలేకర్లకు తెలిపా రు. ఫ్లెక్సీలలో కూడా తన ఫొటో వేయకుండా ప్రొటోకాల్‌ ఉల్లంఘించారని రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు