బాలయ్యా.. మా ఇళ్లులయ్యా..!

26 Jun, 2017 11:49 IST|Sakshi
బాలయ్యా.. మా ఇళ్లులయ్యా..!

► ఇంటిపట్టాల విషయమై పట్టుబట్టిన బాధిత మహిళలు
► తహసీల్దార్‌ చూస్తారంటూ తప్పించుకెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణ


హిందూపురం అర్భన్ : ‘అయినవారికి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో.. అదే ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా అరక్షణం కూడా ఆగను. ఐ విల్ సో ద హెల్(నరకం చూపిస్తా)’ అంటూ లెజెండ్‌ సినిమాలో వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా డైలాగులు చెప్పిన బాలయ్య నిజ జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ ఇంటి పట్టాలు రద్దు చేశారయ్యా అంటూ బాధిత మహిళలు ఆయన ఇంటిముందు గగ్గోలు పెట్టినా వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపకుండా వెళ్లిపోయారు.

గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టాలు రద్దు చేసి ఇతరులకు ఇచ్చేస్తున్నామని, ఆ స్థలాలు ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నరంటూ ఇందిరమ్మకాలనీ మహిళలు ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిముందు గగ్గోలు పెట్టారు. గతంలో వారికి ఇచ్చిన ఇంటిపట్టాలు చేతపట్టుకుని ఉదయం 7గంటల నుంచే పడిగాపులు కాచారు. వారిని లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి 11గంటల సమయంలో బాలకృష్ణ బయటకు వచ్చారు. బాధిత మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘ఇంటిపట్టాలు రద్దు చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఎక్కడికి పోవాలయ్యా... మా ఇంటిపట్టాలు రద్దుచేసి టీడీపీ నాయకుల అనుచరులకు ఇస్తారంట..! ఇదేమి న్యాయమయ్యా!’ అని ప్రశ్నించారు.

‘ఎన్నికల సమయంలో అందరికీ స్థలాలు,ఇల్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చినవి కూడా లాగేస్తారా’ అని వాపోయారు. తమకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ భీష్మించారు. దీంతో బాలకృష్ణ తహసీల్దార్‌ విశ్వనాథ్‌ను పిలిపించి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇంటి లోపలకు వెళ్లిపోయారు.ఇంటి పట్టాలు ఇవ్వడంతో తాము పునాదులు కూడా వేసుకున్నామని, ఇప్పుడు కాదని పొమ్మనడం ఎక్కడి న్యాయమని మహిళలు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.

మీకు కావాల్సిన వారికోసం పేదలైన మాకు అన్యాయం చేస్తున్నారని శాపనార్థాలు పెట్టారు. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇంతలో వచ్చిన వారిలో ఒకరు చార్టులో ‘ఎమ్మెల్యే సార్‌.. మేము ఆత్మహత్య చేసుకుంటాం’ అని రాసి చూపుతుండగా పోలీసులు ఆ పోస్టరు లాగేసి చించిపడేశారు. తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని మహిళలు తెగేసి చెప్పారు. అంతలో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ‘తహసీల్దార్‌ చూస్తారులేమ్మా’ అంటూ పోలీసు బందోబస్తుతో వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు