ఎక్స్‌ట్రా చేస్తే తాట తీస్తా: బాలకృష్ణ

8 Jun, 2018 13:46 IST|Sakshi
ఎమ్మెల్యే బాలకృష్ణ ఎదుటే నేతల వాదులాట.. రోడ్ల దుస్థితిని వివరిస్తూ కార్యకర్త ఫేస్‌బుక్‌ పోస్ట్‌‌(ఇన్‌సెట్‌లో)

జెండా మోసిన కార్యకర్తలకు ఏమీ చేయడం లేదు 

నేతలంతా కార్యకర్తల రక్తం తాగుతున్నారు 

ఎమ్మెల్యే బాలకృష్ణ ఎదుట కార్యకర్తల ఆవేదన 

సమీక్షా సమావేశంలో బయటపడ్డ గ్రూపు విభేదాలు 

తాట తీస్తానంటూ హెచ్చరించిన బాలయ్య 

‘‘సార్‌.. మేము దళితులం. మీకు పూలదండ వేసేందుకు కూడా పనికిరామా.. వచ్చిన ప్రతిసారీ మమ్మల్ని పక్కకు లాగేస్తున్నారు. ఏళ్లుగా పార్టీ జెండా మోసినందుకు మాకిచ్చే గౌరవం ఇదేనా.’’

ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. పనులు మాత్రం పర్సెంటేజీలు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. ఇదేం న్యాయం. మనోడైనా.. ప్రశ్నిస్తే పగోడే!

అసలే బాలయ్య. కోపమొస్తే ఎవరి చెంప చెల్లుమంటుందో తెలియదు. రాకరాక ఊరికొస్తే.. ఆయనను ప్రశ్నిస్తే ఇంకేమైనా ఉందా! తనకు అంతా తెలుసనీ, ఎక్స్‌ట్రా చేస్తే తాట తీస్తానని తనదైన శైలిలో సినిమా డైలాగ్‌ చెప్పేశారు.
 

సాక్షి, హిందూపురం అర్బన్‌: చుట్టపుచూపుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే ఎమ్మెల్యే బాలకృష్ణ... నాలుగేళ్ల తర్వాత... క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని భావించారు. ఈక్రమంలోనే గురువారం ఆయన స్థానిక సాయిరాం ఫంక్షన్‌ హాలులో చిలమత్తూరు మండలంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం కాగా కార్యకర్తలు, నేతలు బాహాబాహీకి దిగడంతో బాలయ్య దిమ్మదిరిగింది.  

బయటపడ్డ విభేదాలు 
చిలమత్తూరు మండలంలోని పంచాయతీల వారీగా సమస్యలపై చర్చిస్తుండగా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోడూరు పంచాయతీ గురించి ప్రస్తావన రాగానే.. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ నాశనం అయిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. పనులన్నీ పర్సంటేజిలు ఇచ్చినవారికే ఇచ్చుకుంటున్నారనీ.. కార్యకర్తలకు న్యాయం చేయడంలేదన్నారు. పాపన్న అన్నింటికీ అడ్డుపడుతూ వర్గాలు సృష్టిస్తున్నాడని ముద్దçపల్లి వెంకటసుబ్బయ్య ఆరోపించారు. దీంతో పాపన్న స్పందిస్తూ... పార్టీ అభివృద్ధికోసం పనిచేస్తున్న తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు. వారికి బాలకృష్ణ పీఏ వీరయ్య, శివప్పలు నచ్చచెప్పి కుర్చోబెట్టారు. ఇంతలో మరో కార్యకర్త  స్పందిస్తూ..నేతలుæకార్యకర్తల రక్తం తాగుతున్నారనీ, కనీసం విలువ కూడా ఇవ్వడం లేదన్నారు.  

దళితులంటే చులకన 
అనంతరం గంగాధర్‌ అనే కార్యకర్త మాట్లాడుతూ, దళితులందరూ పార్టీ అభివృద్ధికి పనిచేస్తూ ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తున్నామన్నారు. అయితే తమకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు.  కనీసం మీకు పూలదండ వేయడానికి వచ్చినా పక్కకు లాగేస్తున్నారని బాలకృష్ణ ఎదుట వాపోయారు. ఎస్సీ కాలనీలో అనేక సమస్యలున్నా.. తీర్చేవారు లేరన్నారు. అనంతరం పాతసామర్లపల్లికి చెందిన మంజు మాట్లాడుతూ, చాలాకాలంగా తాను స్టోరు డీలరుగా ఉన్నాననీ,  అయితే జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ తన స్టోరుపై అధికారులతో దాడిచేయించి స్టోరును లాగేసుకున్నాడన్నారు. ఇక అధికారులే  తనపై లేనిపోనివి చెప్పి జనంతో ధర్నాలు  చేయిస్తున్నారని చిలమత్తూరు సర్పంచ్‌ శ్రీకళ వాపోయారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు కూడా ఇలా చేయలేదనీ, టీడీపీలోకి వచ్చాక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 

ఎక్స్‌ట్రా చేస్తే తాటతీస్తా... 
అన్నీ విన్న ఎమ్మెల్యే బాలకృష్ణ... ఏ పంచాయతీలో ఏం జరుగుతుందో అన్నీ తనకు తెలుసనీ...ఎక్స్‌ట్రా చేస్తే తాట తీస్తా నంటూ అక్కడున్న వారందరినీ హెచ్చరించారు. 20తేదీ నుంచి పంచాయతీల్లో పర్యటిస్తాననీ...అన్నీ చూచి ఒక్కొక్కరికి ఏంచేయాలో అది చేస్తానన్నారు.  సమావేశంలో టీడీపీ ఎంపీపీ నౌజియాభాను, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ, సర్పంచి శ్రీకళ, టీడీపీ బీసీసెల్‌ జిల్లా అ«ధ్యక్షుడు శివప్ప, మండల కన్వీనర్‌ బాబురెడ్డి పాల్గొన్నారు. 

రోడ్డులేదని చెప్పడానికొస్తే ఈడ్చిపడేశారు

చిలమత్తూరు మండలం మరుసనపల్లి పంచాయతీ ఎస్‌.ముద్దిరెడ్డిపల్లి గ్రామంలో రోడ్డు లేదు. వర్షం వస్తే మట్టిరోడ్డు బురదమయం అవుతోంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టా. బాలయ్య వచ్చాడు కదా అని చెప్పేందుకు వెళ్తే చుట్టూ చేరిన వారి మాటలు విని నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అంటూ నానా దుర్భాషలాడాడు. బయటికిపో అంటూ గద్దించాడు. పోలీసులు బలవంతంగా బయటకు ఈడ్చేశారు. – బత్తుల బాలాజి, ముద్దిరెడ్డిపల్లి టీడీపీ కార్యకర్త 

మరిన్ని వార్తలు