బండారుసరుస

11 Feb, 2019 07:51 IST|Sakshi
ఎస్సీ యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే మాధవనాయుడు

ప³శ్చిమగోదావరి జిల్లా సరిపల్లిలో ఘటన

మాధవనాయుడిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్‌

భీమవరం రోడ్డులో దళితుల ధర్నా

సాక్షి, నరసాపురం రూరల్‌(పశ్చిమగోదావరి): ఎస్సీ యువకులపై నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఓ యువకుడిని మెడపట్టి గెంటేశారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని సరిపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే..
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెండు రోజుల నుంచి హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నరసాపురం మండలం సరిపల్లి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం. ఇక్కడ గత పాలకుల హయాంలోనే పంచాయతీకి నూతన భవనం నిర్మించారు. అయితే ఈ భవనం ఎస్సీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఉండటంతో ఎమ్మెల్యే మాధవనాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పంచాయతీ కార్యాలయాన్ని తమ సామాజికవర్గం ఉన్న ప్రాంతానికి మార్చాలని యత్నించారు.  దీనిలో భాగంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి గతేడాది జూలైలో శంకుస్థాపన చేశారు. ఎస్‌డీఎఫ్, ఉపాధిహామీ నిధులు రూ.37.50లక్షలతో ఈ పనులు చేపట్టారు. అయితే అప్పట్లో శంకుస్థాపన సందర్భంలోనూ రెండు కులాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అయినా ఎమ్మెల్యే మొండిగా కొత్త పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి.

కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కొత్తభవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మాధవనాయుడు పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు గమిడి మధుబాబు, మైలాబత్తుల కృష్ణంరాజు తదితరులు భవన నిర్మాణ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ప్రారంభించడం తగదని ఎమ్మెల్యేకు వివరించే యత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మాధవనాయుడు కోపంతో ఊగిపోతూ ఆ ఎస్సీ యువకులను మెడపై చేయివేసి బయటకు గెంటారు. ఈ పరిణామం నుంచి ఎస్సీ యువకులు తేరుకునేలోపే రూరల్‌ఎస్సై మూర్తి, తెలుగుదేశం చోటా నాయకులు ఒక్కటై వారిని ఈడ్చి పక్కకు లాగేశారు. ఈ పెనుగులాటలో యువకుల దుస్తులూ చిరిగాయి. ఈ తతంగం ఇలా జరుగుతుండగానే ఎమ్మెల్యే తన అధికారదర్పాన్ని ప్రదర్శిస్తూ కొత్తపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

గ్రామస్తుల ఆందోళన
ఎమ్మెల్యేకు తీరుకు వ్యతిరేకంగా ఎస్సీ యువకులు గ్రామస్తులతో కలిసి నరసాపురం-భీమవరం రోడ్డుపై బైఠాయించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఈ యువకులు రూరల్‌పోలీసు స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే, టీడీపీ చోటా నాయకులు, రూరల్‌ ఎస్సై తదితరులు తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన చెందారు. అంతే కాకుండా ఎమ్మెల్యే మాధవనాయుడు తమను కులంపేరుతో దూషించారని ఆయనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన వారిలో మైలాబత్తుల రాజ్‌కుమార్, కేదాసు స్వరాజ్యకుమార్, మైలాబత్తుల కుటుంబరావు, ఏలూరి చంటి, ఉండ్రు స్టాలిన్, పి వెంకట్రావు, ఎం శరత్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు