ఎమ్మెల్యే బీసీ సోదరుల దౌర్జన్యం

4 Nov, 2018 10:46 IST|Sakshi

కర్నూలు /బనగానపల్లె: ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి సోదరులు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, బీసీ రాజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. వారి అనుచరుడు శంకర్‌తో పాటు పలువురితో కలిసి వైఎస్సార్‌సీపీ ప్రచార రథం డ్రైవర్‌ గోరే బాషాపై దాడి చేశారు. ఇందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార రథం ఎమ్మెల్యే బీసీ ఇంటికి సమీపంలోని పాతబస్టాండ్‌ మీదుగా వెళ్తుండగా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి ఆయన సోదరులు, అనుచరులు వచ్చి తనపై దాడి చేసినట్లు డ్రైవర్‌ గోరే బాషా తెలిపారు.

 ఈ సమయంలో కాటసాని రామిరెడ్డి ఇక్కడికి సమీపంలోని 101వ బూత్‌లో ఇంటింటా నవరత్నాల గురించి వివరిస్తున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే  పట్టణంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాతబస్టాండ్‌లోనే ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే బీసీకి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తేనే విరమిస్తామని వారు స్పష్టం చేశారు.

 ‘ఇక్కడికి వాహనం రాకూడదంటూ బీసీ సోదరులు నాపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. చొక్కా చింపారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? నాకు ఏమైనా అయితే ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత. ఆయన కుటుంబంతో నాకు ప్రాణహాని ఉంది’ అంటూ డ్రైవర్‌ గోరేబాషా ఎస్‌ఐ సత్యనారాయణతో వాపోయారు. దాడికి పాల్పడడం తప్పేనని, పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ సూచించారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ‘ఎమ్మెల్యే డౌన్‌డౌన్‌’ అంటూ ర్యాలీగా పోలీసుస్టేషన్‌  సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్దకు చేరుకున్నారు. 

కాటసాని ఆధ్వర్యంలో రాస్తారోకో  
తమ వాహన డ్రైవర్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యక్రమా న్ని మధ్యలోనే ముగించి హుటాహుటిన పెట్రోల్‌ బంకు సర్కిల్‌కు వచ్చారు. అక్కడే కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. తరువాత పోలీసుస్టేషన్‌ లోపలకు వెళ్లి ఎస్‌ఐతో మాట్లాడారు. పట్టణంలో వారం రోజుల నుంచి రావాలి జగన్‌ –కావాలి జగన్‌ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఓర్వలేకనే ఎమ్మెల్యే బీసీ సోదరులు ప్రచారరథం డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే బీసీ సోదరులు బీసీ రామ్‌నాథ్‌రెడ్డి, బీసీ రాజారెడ్డితో పాటు మరికొందరిపై  ఫిర్యాదు చేశారు. సీఐ లేదా డీఎస్పీ వచ్చి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప తాను ఇక్కడి నుంచి  వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అనంతరం సీఐ సురేష్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వాహనంలో ఎదురుగా వచ్చిన ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి తమ పార్టీ కార్యకర్తలు జరిగిన ఘటన గురించి వివరించేందుకు యత్నించగా.. ఆయన వినకుండా గన్‌తో కాల్చివేస్తామంటూ బెదిరించారని తెలిపారు.  ఈ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. 

ఉద్రిక్త వాతావరణం 
ఒక దశలో సీఐ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బీసీ వాహనంలో ఎదురు రాగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించి వేశారు.   

బీసీ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
డ్రైవర్‌ గోరేబాషాపై ఎమ్మెల్యే బీసీ సోదరులు వారి అనుచరులతో కలిసి కర్రలతో దాడి చేసి గాయపర్చడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా  ప్రచారం చేసుకునే హక్కు ఉంది. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారు.  ఎమ్మెల్యే బీసీ సోదరులు, వారి అనుచరులపై  కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యాన్నీ చూపరాదు.
 – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే 

మరిన్ని వార్తలు