అన్న ఉన్నాడు.. అధైర్య పడొద్దు..

4 Jun, 2019 11:23 IST|Sakshi
బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భరోసా

భారీ వర్షంలోనూ చెరువూరు వెళ్లిన ఎమ్మెల్యే

చింతపల్లి(పాడేరు):  మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి జగన్‌మోన్‌రెడ్డి హామీ ఇచ్చారని, మీరు అధైర్య పడవలసిన అవసరం లేదని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చెరువూరు మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మండలంలోని బలపం పంచాయతీ చెరువూరు గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు ఆదివారం ఆటోపై స్వగ్రామానికి వెళ్తుండగా... ఆటో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గిరిజనులు మృతి చెందంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు చేయాలని  కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు.  ఎంపీడీవో ప్రేమాకర్, తాహసీల్దార్‌ సత్యనారాయణ అత్యవసరంగా దహనక్రియల ఖర్చుల నిమిత్తం మృతుల కుటుంబాలకు    రూ.5వేల చొప్పున అందజేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సోమవారం హుటాహుటిన చెరువూరు వెళ్లారు. భారీ వర్షం కారణంగా వాహన రాకపోలకు తీవ్ర అంతరాయం కలిగినా లెక్క చేయకుండా ఆమె మధ్యాహ్నం 3.30గంటలకు గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వంజారపు చిట్టిబాబు, సోదరుడు గంగరాజు, లోత బొంజుబాబు, ఆటో డ్రైవర్‌ వంతాల కృష్ణారావు, జనుగూడి ప్రసాద్‌ కుటుంబాలను ఆమె పరామర్శించారు.   మృతదేహల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ప్రమాదం ఎలాజరిగిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుం బాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు ఆమె తెలిపారు.మృతుల  కుటుంబ సభ్యులను  ఓదా ర్చారు.

బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని చెప్పారు.  ఆటో డ్రైవర్‌ వంతాల కృష్ణారావు కుటుం»  సభ్యులను ఓదార్చే క్రమంలో ముగ్గురు పిల్లలు భోరున విలపించడంతో భాగ్యలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలకు దహన క్రియలకోసం ఆమె సొంత సొమ్ము రూ.20వేలు అందజేశారు. ఒడిశా ప్రాంతానికి ఆనుకుని ఉన్న చెరువూరును ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి  సందర్శించడం ఇదే మొదటి సారి.   గాయపడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మిమ్స్‌ ఫ్రొఫెసర్‌ నర్సింగరావు, అరకు పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, కార్యదర్శి గణబాబు, పాడేరు మాజీ ఎంపీపీ ఎస్వీ రమణమూర్తి, చల్లంగి సుగునాథం, చింతపల్లి మండల అధ్యక్షుడు మోరి రవి, నాయకులు అభిస్వరూప్, మీరా తదితరులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

కేజీహెచ్‌లో ఎమ్మెల్యే పరామర్శ
పాడేరు: చింతపల్లి మండలం చెరువూరు వద్ద  విద్యుత్‌ స్తంభాన్ని ఆటో ఢీకొన్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సోమవారం పరామర్శించారు. ఆమె కేజీహెచ్‌కు వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు మెరుగైన వైద్య సేవలు అందించాలని  వైద్యులను కోరారు. 

మరిన్ని వార్తలు