పారిశుద్ధ్య కార్మికులతో భూమన సహపంక్తి భోజనం

13 Apr, 2020 09:29 IST|Sakshi
కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి  

తిరుపతి తుడా : తిరుపతి స్వచ్ఛతకు నిత్యం పాటుపడుతూ కరోనా నియంత్రణలో విశేషంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆదివారం సహపంక్తి భోజనం చేశారు. ఫుట్‌పాత్‌పై కార్మికులతో పాటు చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటానికి పారిశుద్ధ్య కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ మన సమాజంలో వారికి గౌరవం దక్కడం లేదన్నారు. వారి ప్రాణాలను, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని కొనియాడారు. వారితో కలిసి భోజనం చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పారు. తిరుపతిలోని 11 వార్డుల్లో రెడ్‌జోన్‌ ప్రకటించడం జరిగిందన్నారు. కార్మికులు అక్కడికి వెళ్లి కూడా రోడ్లపై బ్లీబింగ్‌ చల్లుతూ.. పరిసరాలను శుభ్రం చేస్తున్నారని తెలిపారు. వారి సేవలను తప్పకుండా అభినందించాల్సిందేనని అన్నారు. 

మార్కెట్ల విస్తరణకు స్థలపరిశీలన చేయండి
తిరుపతిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కూరగాయల మార్కెట్ల విస్తరణకు స్థల పరిశీలన చేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కరంబాడిరోడ్డు బొంతాలమ్మ గుడి వద్ద తాత్కాలిక మార్కెట్‌ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. పట్టణంలో 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మార్కెట్లు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు.

మరిన్ని వార్తలు