రైతుల కోసం..

6 Feb, 2019 13:47 IST|Sakshi
ముచ్చుమర్రి నుంచి ఎత్తిపోతల పథకం వద్దకు ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే ఐజయ్య

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌

పలువురి అరెస్టు

కర్నూలు ,నందికొట్కూరు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ ఆయకట్టుకు సాగునీరివ్వాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆందోళన బాట పట్టారు. ఎత్తిపోతల పథకం వద్ద ధర్నా చేసేందుకు మంగళవారం   రైతులతో కలిసి ముచ్చుమర్రి నుంచి ర్యాలీగా అక్కడికి వెళ్లారు. నీటి పంపులను పరిశీలించేందుకు అనుమతి లేదంటూ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ డీఈ బాలాజీ నిరాకరించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు దిగారు. ఈ నెలాఖరు వరకు కేసీకి నీరు వదలాలని నినాదాలు చేశారు. ఎస్‌ఐలు శ్రీనివాసులు, నల్లప్ప, పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో పాటు  వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ కన్వీనర్‌ రమాదేవి, రైతులు రమేష్‌ నాయుడు, తదితరులను  అరెస్టు చేసి ముచ్చుమర్రి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా నిరసన కొనసాగించారు. చివరకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. సత్యనారాయణ హామీతో ఆందోళన కార్యక్రమం విరమించారు.  

మాట తప్పిన సీఎం
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం వాసులు ఇక నుంచి మూడు పంటలు పండించుకోవచ్చని చెప్పారని.. అయితే ఒక పంటకు కూడా సరిగ్గా నీరు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు.  బాబు మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు.  శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల నీటటి మట్టం ఉన్నప్పుడు కూడా కేసీ కెనాల్‌కు   నీరు విడుదల చేయవచ్చునన్నారు. అయితే, ఎందుకో కర్నూలు, కడప రైతులపై సీఎం చిన్న చూపు చూస్తున్నారన్నారు. 106 చెరువులకు ఆక్టోబర్‌ లోపు   నింపుతామని చెప్పి ఇంత వరకు నింపలేదన్నారు.   వైఎస్‌ఆర్‌సీపీ   రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ    ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి   హంద్రీనీవాకు 900 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారన్నారు. దీనిపై నిలదీస్తే విడుదల చేయడం లేదని అధికారులు   అబద్ధాలు చెబుతున్నారన్నారు. ముందుగా ఈప్రాంత రైతుల పంటలకు నీరు వదలాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఏసన్న, నాయకులు రమేష్‌నాయుడు, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు