ఆర్డీవోపై ఎమ్మెల్యే అసహనం

13 Jul, 2015 01:02 IST|Sakshi

 మునిసిపల్ చైర్‌పర్సన్‌ను
 నిలదీసిన తమ్ముళ్లు
 మంత్రి సుజాత ముందు పంచాయితీ
 గంటపాటు ఆసక్తిగా తిలకించిన స్థానికులు
 నరసాపురం అర్బన్ :అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యేగా తనను అటు అధికారులు, ఇటు సొంత పార్టీ ప్రజా ప్రతినిధి పట్టించుకొనకపోవడంపై ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం వలందర రేవు సాక్షిగా మంత్రి పీతల సుజాత ఎదుట ఎమ్మెల్యే అధికారులపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. వివరాల్లోకి వెళితే మంత్రి పీతల సుజాత పుష్కర అభివృద్ధి పనులు పరిశీలించేందుకు వలందర రేవుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఏర్పాట్లపై అధికారులను నిలదీశారు. అంతా మీ ఇష్ట ప్రకారం చేసుకుపోతే నేనెందుకు అంటూ నరసాపురం ఆర్డీవో డి.పుష్పమణిపై అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో పుష్కరాల సమయంలో ట్రాఫిక్ నిబంధనలు దారుణంగా విధిస్తున్నారని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ఎక్కడో చిట్టవరం వద్ద వాహనాలు నిలిపివేసే విధంగానూ, ఘాట్‌ల వద్ద ఒక రేవు నుంచి మరో రేవుకు వెళ్లకుండా బారికేడ్లు కట్టడం ఏమిటని ఆర్డీవోను ప్రశ్నించారు. ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారని నిలదీశారు.
 
 నన్ను గేట్ దగ్గర నిలబడమంటారా !
 మీరు చేస్తున్న పనుల వల్ల జనం తిట్టుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తం  చేశారు. మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపి వేసి జనాలను రాకుండా చేస్తామంటున్నారు.. మరి నన్ను అక్కడ గేటు వద్ద నిలబడి జనాన్ని వెనక్కి పంపమంటారా అంటూ ఎమ్మెల్యే ఆర్డీవోను ప్రశ్నించడంతో అంతా నిర్ఘాంతపోయారు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ఎలాగని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సుజాత కలుగజేసుకుని సమన్వయంతో పనిచేయకపోతే ఎలా అని, ఎమ్మెల్యేని సంప్రదించకుండా వ్యవహరించడం ఎందుకని ఆర్డీవోనూ అడిగారు. వెంటనే ట్రాఫిక్ నిబంధనలపై పునరాలోచన చేయాలని అధికారులను ఆదేశించారు.
 
 మంత్రి ముందు చైర్‌పర్సన్‌ను నిలదీసిన తమ్ముళ్లు
 ఎమ్మెల్మే, ఆర్డీవోల మధ్య వివాదం అనంతరం కూడా వలందర రేవు వద్ద పంచాయితీ నడిచింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొప్పాడ రవీంద్ర మరికొందరు మంత్రి సమక్షంలో మునిసిపల్ అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మునిసిపల్ చైర్‌పర్సన్ రత్నమాలను నిలదీశారు. గోదావరి పొడవునా జరిగిన గ్రానైట్ రెయిలింగ్ వద్ద మీ పేరు మాత్రమే ఎందుకు వేసుకున్నారని, ఎమ్మెల్మే పేరు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దీనికి చైర్‌పర్సన్ కూడా దీటుగా సమాధానం ఇవ్వడంతో మంత్రి ముందే వాగ్వివాదం జరిగింది. అవసరమైన చోటల్లా ఎమ్మెల్యే పేరు వేస్తున్నామని, దీన్ని గమనించాలని చైర్‌పర్సన్ అన్నారు. అయితే వలందర రేవుకు ఎన్టీఆర్ పేరు పెట్టమని పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా లేఖ రాస్తే ఎందుకు చర్య తీసుకోలేదని, మునిసిపల్ పనులు మీ డబ్బుతో జరగడం లేదని గుర్తు పెట్టుకోవాలని రవీంద్ర అన్నారు. దీనికి చైర్‌పర్సన్.. అభివృద్ధి పనులు పార్టీ కార్యక్రమాలు కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మంత్రి సుజాత జోక్యం చేసుకుని ముందు పుష్కరాల పనిని విజయవంతంగా ముగిద్దాం, తరువాత రాజకీయాలు చూసుకుందాం అంటూ సర్ది చెప్పారు. ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న ఎమ్మెల్యే మౌనంగా ఉండడం చర్చనీయాంశమయింది. ఈ ఘటనతో ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమైనట్టయింది.
 
 

మరిన్ని వార్తలు