తూచ్‌... అది మాదే!

28 Jun, 2017 01:24 IST|Sakshi
తూచ్‌... అది మాదే!

గిరిజనులకు పంచిన భూములపై మంత్రి కన్ను
రూ.కోట్లు పలుకుతుండటంతో లాక్కునే ప్రయత్నం
మంత్రి పదవి రాగానే కదిలించిన ఫైళ్లు   â ఎంచక్కా సహకరిస్తున్న అధికారులు
అప్పట్లోనే పొరపాటు జరిగిందంటూ అధికారుల కొత్త భాష్యం
భూములిచ్చేయాలని అమాయక రైతులకు నోటీసులు
పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మంచి నాయకుడికి పదవి వస్తే ఏం చేస్తాడు. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అంతో ఇంతో మంచి చేయాలనుకుంటాడు. కానీ అలా నమ్మిన జనం నోట్లో మట్టికొట్టేందుకు యత్నించాలనుకోడు. ఇక్కడ ప్లేటు మారింది. కేవలం ప్రజా సేవకోసం.. వారి సంక్షేమం కోసం పదవులు అధిష్టించినట్టు ఆ నాయకుడు చెప్పాడు. జనం కూడా అది నిజమేనని నమ్మారు. కానీ కేవలం స్వలాభం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసమే పాలకపక్షం పంచన చేరి మంత్రి పదవికోసం పాకులాడారని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ఒకే కోవకు చెందినవారంతా ఒక్కచోటకు చేరుతారనడానికి జిల్లాకు చెందిన మంత్రి ఆర్‌.వి.సుజయ కృష్ణ రంగారావే ఉదాహరణగా నిలిచారు. భూదాహంతో రగిలిపోతున్న చంద్రబాబు పంచన చేరి ఈయనా... అదే పంథాను జిల్లాలో అవలంబిస్తుండటం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.  వెనక్కు తెచ్చుకోవడం సుజయ్‌కు కుదరలేదు.

పదవి రాగానే పని మొదలు
వైఎస్సార్‌సీపీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలుపొందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు గతేడాది ఏప్రిల్‌లో అధికారపార్టీలో చేరారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో గనుల శాఖ మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. టీడీపీలో చేరిన మరునాటి నుంచీ సుజయ్‌ ధ్యాసంతా పేదల భూములపైనే ఉంది. ఇచ్చిన భూముల్లో పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి మండలం మల్లంపేట గ్రామం సర్వే నెం.247/2లో ఉన్న 14.83 ఎకరాలకు భూ పరిమితి చట్టం నుంచి కోర్టు ద్వారా మినహాయింపు పొందామంటున్నారు. వీటితో పాటు ఎక్కువగా ఇచ్చేశామనుకుంటు న్న ఇదే మండలం గొల్లపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నం.45లో ఉన్న ఎనిమిది ఎకరాలను అధికారులను అడ్డుపెట్టుకుని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు.

ఎకరా రూ.కోటిన్నరపైనే...
ఈ ప్రాంతంలో ఇప్పుడు భూమి విలువ ఎకరా సుమారు రూ.కోటిన్నర పలుకుతోంది. దీంతో ఈ భూములను పేదల నుంచి లాక్కోవాలని మంత్రి పావులు కదుపుతున్నారు. అమాత్యుని మెప్పుకోసం కొందరు అధికారులు ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. దానిలో భాగంగా మల్లంపేటలో 15 మందికి, గొల్లపల్లిలో 17 మందికి నోటీసులు జారీ చేశారు. ఇదెక్కడి న్యాయమని, తాము ఈ భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నామని, వీటిని లాక్కుంటే తమ కుటుంబాలు వీధిన పడతాయని అక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నా మంత్రికిగానీ, అధికారులకు గానీ వారి గోడు వినిపించడం లేదు. ఎలాగైనా దానిని స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

నాకేం తెలియదు
నేను వచ్చి వారమే అయ్యింది. మంత్రి భూములకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. కొన్ని ఎకరాలు వెనక్కు ఇచ్చేయమని అడుగుతున్నట్లు పత్రికల్లో వార్తలను బట్టి తెలిసింది. అంతకు మించి ఏమీ తెలియదు. దీనిపై పూర్తి సమాచారం తెప్పించుకుంటాను.
– సుదర్శనదొర, ఆర్‌డీఓ, పార్వతీపురం.

అప్పుడు పొరపాటు జరిగింది
గొల్లపల్లి రెవెన్యూ విలేజ్‌లో ఎనిమిది ఎకరాల భూమిని మంత్రి సుజయకృష్ణ రంగారావు విజ్ఞప్తి మేరకు ఆయనకు స్వాధీన పరిచే ప్రక్రియ జరుగుతోంది. గతంలో భూ పరిమితి చట్టం ప్రకారం వారు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఇచ్చారు. అప్పట్లో మా అధికారులు సరిగ్గా చూసుకోక పోవడంవల్ల పొరపాటు జరిగింది. మావైపు తప్పు జరిగింది సరే.. రైతులు ఆ భూముల్ని దున్నుకోవాలి కదా. డి ఫారం పట్టా కండిషన్‌ నెం.2 ప్రకారం పట్టా పొందిన తర్వాత మూడేళ్లలోపు ఆ భూమిని సాగులోకి తీసుకురాకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. నేను తనిఖీ చేశాను. రైతులు చెబుతున్నట్లు వర్షాకాలంలోనే కాదు ఆ భూముల్లో ఏ కాలంలోనూ సాగు చేసినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అడంగల్‌లోనూ అవి కొర్ణు భూములుగానే ఉన్నాయి.
– కోరాడ సూర్యనారాయణ, తహసీల్దార్, బొబ్బిలి.

మరిన్ని వార్తలు