ఖాకీ డ్రెస్ వదిలేసి రా...

14 Sep, 2013 04:36 IST|Sakshi
 •  రాజకీయాల్లోకి వస్తే ఎవరేంటో తేల్చుకుందాం...
 •      చేతిలో లాఠీ ఉందని చెలరేగితే సహించేది లేదు..
 •      నన్ను టార్గెట్ చేయడం కోసం లక్షల మందికి ఇబ్బందులా..?
 •      లెసైన్స్ లేకపోతే జైలుకు పంపించే అధికారం ఎవరిచ్చారు..?
 •      ఎస్పీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కూనంనేని
 • కొత్తగూడెం, న్యూస్‌లైన్: ‘‘ధైర్యం ఉంటే, ఖాకీ డ్రెస్సు వదిలి బయ టకు రా... రాజకీయాల్లోకి వస్తే ఎవరేంటో తెలుస్తుంది... చేతిలో లాఠీ ఉందని చెలరేగిపోతే.. ఇక సహించేది లేదు... నన్ను టార్గెట్ చేయడం కోసం లక్షలాది మంది ఆటో డ్రైవర్లను రోడ్డుకు ఈడుస్తున్నావు... పోలీసు శాఖలో అంతా నీతిపరులే ఉన్నా రా..? పక్కదారి పడుతున్న కేసులపై లేని ఆలోచన, శ్రద్ధ.. కేవలం ఆటో డ్రైవర్లపై ఎందుకు వచ్చింది..? ఆటో డ్రైవర్లకు లెసైన్స్ లేకపోతే.. ఐపీసీ 279 కింద జైలుకు పంపే అధికారం ఎవరిచ్చారు..?’’ అని, ఎస్పీ ఎవి.రంగనాధ్‌పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు.
   
   ఆటో డ్రైవర్ల జిల్లావ్యాప్త బందులో భాగంగా ఆటో వర్కర్స్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్డాఫీస్ నుంచి సూపర్‌బజార్ సెంటర్ వరకు శుక్రవారం ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. చెకింగుల పేరుతో ఆటో డ్రైవర్లను కొందరి ప్రోద్బలంతోనే ఎస్పీ హింసిస్తున్నారని ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా వందలాది కేసులు పక్కదారి పడుతున్నా పట్టించుకోని ఎస్పీ.. ఆటో డ్రైవర్లను మాత్రం రోడ్డున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘వేలమంది రోడ్డు ఎక్కేలా చేసిన నిన్ను సమర్థుడంటారా.. అసమర్థుడంటారా..? అంతా సవ్యంగా ఏ శాఖలో జరుగుతోంది? పోలీసు శాఖలో అందరూ నీతిపరులే ఉన్నారా..?’’ అని, కూనంనేని ప్రశ్నిం చారు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తుంటే పోలీసు శాఖకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ‘‘డ్రైవర్లపై కేసులు పెడుతున్న ఎస్పీ... ఒక్క రోజు ఆటో డ్రైవర్‌గా జీవనం గడిపితే, వారి కష్టనష్టాలు తెలుస్తాయి. చేతనైతే పేదవారికి సాయం చేయాలే తప్ప.. వారిని హింసించడం తగదు’’ అన్నారు. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడిన తనపై గతంలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, 18 రోజులపాటు జైలులో ఉంచారని, నిర్దోషిగా బయటకు వచ్చానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన వారే.. ఆ తరువాత తనకు క్షమాపణలు చెప్పారని అన్నారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల చంద్రశేఖర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కోనేరు సత్యనారాయణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
   
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా