‘టీడీపీ లేనిపోని అపోహలు సృష్టిస్తోంది’

16 May, 2020 13:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ పాలన కంటే వంద రెట్లు మెరుగైన పాలన అందిస్తున్నామని విజవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు చెప్పారు. శనివారం విజయవాడ  సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని విష్ణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం నాలుగో విడుత రేషన్‌ అందిస్తోంది. వాలేంటీర్ల వ్యవస్థ ను వినియోగించుకుని భౌతిక దూరం పాటిస్తూ పేదలకు రేషన​ అందిస్తున్నాం.రాష్ట్ర వ్యాప్తంగా కోటి 50 లక్షల పై చిలుకు, నగరంలోని 1లక్ష 74వేల రేషన్ కార్డుదారులకు  ఉచిత రేషన్ ద్వారా లబ్ది చేకూరుతుంది.

రేషన్‌కార్డు లేని వారికి వార్డు సచివాలయల ద్వారా  నూతన కార్డులు వచ్చేలా చర్యలు చేపట్టాం. రాష్టంలో లబ్ధిదారులకు 80 వేల నూతన రేషన్ కార్డులు అందించాం. పేదవారు ఎవరు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. లాక్ డౌన్ సమయంలో సైతం సంక్షేమపథకాలు అమలు చేస్తోన్నాం. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పావలా వడ్డీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్  పధకాలు తెచ్చాం. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని మల్లాది విష్ణు తెలిపారు. ఇక కరెంట్ చార్జీల విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కరెంట్‌ ఛార్జీలు పెంచలేదని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను తమ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. దేవినేని ఉమా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. (జనసేన నేత దాడి.. ఆత్మహత్యాయత్నం)

మొక్క జొన్న రైతులకు 500 కోట్లు , విద్యార్థులకు1700 కోట్లు చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని ప్రతి పక్షాలు చూస్తున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా కరెంటు చార్జీలు పెంచిన దాఖలాలు లేవని వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులను సబ్ స్టేషన్ ల వారిగా ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని వివరించమని ఆదేశించినట్లు తెలిపారు. విజయపాల డైరీ ధరలను లీటరుకు 4 రూపాయలు ఎవరిని అడిగి పెంచారని నిలదీశారు. పాల ధరల పెంపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల మీద నాలుగు రూపాయలు భారం వేసి ఏ మోహం పెట్టుకుని తమ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

బకాయిలు, అప్పులు, అవినీతి ప్రభుత్వం టీడీపీదని ... సంక్షేమ ప్రభుత్వం తమదని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. సబ్సిడీలు ప్రగతికి ప్రతి బంధకాలు అనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడుని, దుర్ఘటనలను కూడా స్వార్ధ ప్రయోజనాలకు వాడుకునే నీచ నాయకుడు ఆయన అని ధ్వజమెత్తారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, అన్ని వర్గాలకు ప్రభుత్వం సంక్షేమాన్ని  అందిస్తుందని తెలిపారు. మే 30  రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అని తెలిపారు.  టీడీపీ దౌర్భాగ్య పాలనకు నిదర్శనం 23 సీట్లు గెలవడమేనని ఎద్దేవా చేశారు. బోండా ఉమా, దేవినేని ఉమాకి  సీఎం జగన్‌ మోహన​ రెడ్డిని విమర్శించే నైతిక హక్కులేదని మండిపడ్డారు. ('పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు')

మరిన్ని వార్తలు