అమరావతే రాజధానిగా కొనసాగుతుంది

22 Aug, 2019 17:35 IST|Sakshi

సాక్షి, నెల్లూరు:  అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో వరద నీళ్లు వచ్చాయని, అప్పటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని మాత్రమే మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారని ఆయన పేర్కొన్నారు. దీంతో టీడీపీ రాజధానిని మార్చేస్తున్నారంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్న మంత్రి మండిపడ్డారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం కాదని చెప్పిందని ... అయినా చంద్రబాబు అక్కడే రాజధానిగా నిర్ణయించారన్నారు. 

గురువారం మంత్రి ఆత్మకూరు నియోజకవర్గంలో వాసిలి, నెల్లూరు పాలెం, ఎన్నవాడ గ్రామాల్లో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన .... ఆత్మకూరు నియోజక వర్గంలోని ప్రజల సమస్యలపై ఏర్పాటు చేసిన ఎంజీఆర్ హెల్ప్‌లైన్‌కు ఇప్పటివరకూ 150కిపైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందులో 45 సమస్యలను పరిష్కరించామని మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని మిషన్‌ భగీరథ తరహాలోనే రాష్ట్రంలో కూడా తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరువు భవిష్యత్తులో ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు