చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడం

7 Jan, 2020 20:08 IST|Sakshi

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని.. దమ్ముంటే ముసుగు తీసి బయటకు రావాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే అక్కడి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పక్కాప్లాన్‌ ప్రకారమే తనపై హత్యాయత్నం చేయించారని నిప్పులు చెరిగారు. ఆయన ఆస్తులను కాపాడుకునేందుకే అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై హత్యాయత్నం చేసింది.. రైతులు కాదని.. టీడీపీ గూండాలేనని పేర్కొన్నారు. తనపై దాడి చేసినవారి విజువల్స్‌ ఉన్నాయని.. ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. గతంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు. మాపై దాడులు చేయడానికి మేం ఏమైనా పాకిస్తాన్‌ నుంచి వచ్చామా అని ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు నిజాయితీగా రాజకీయం చేయాలన్నారు. ‘నాయకులపై దాడులు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా.. నిరసనలు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని’ తెలిపారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వ లేకపోతున్నారన్నారు. అన్నివర్గాలకు న్యాయం చేయాలనే సీఎం జగన్‌ ఆలోచన చేస్తున్నారన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో రైతులు పడొద్దని.. రైతు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూచించారు. రైతులపై సీఎం జగన్‌కు సానుభూతి ఉందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం ఘటనపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, విడదల రజని తదితరులు ఉన్నారు.

చదవండి : ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం

మరిన్ని వార్తలు