మాధురికి ఎమ్మెల్యే ప్రసన్న లక్ష రూపాయల సాయం

13 Jul, 2020 11:04 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి

నేడు కావలి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేత

సాక్షి, కావలి: పట్టణంలోని ముసునూరుకు చెందిన డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థి కాకర్ల మాధురిని ఆదుకునేందుకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ముందుకొచ్చారు. మాధురి బ్లడ్‌ కేన్సర్‌తో పోరాటం చేస్తోంది. అమ్మ, తమ్ముడు దివ్యాంగులు, తండ్రికి ప్రమాదవశాత్తూ కాలు విరగడంతో ఆ కుటుంబ దుస్థితిపై ‘అయ్యో’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి దాతల నుంచి అనూహ్య స్పందన లభించింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరుతో నిర్వహిస్తున్న చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామని ప్రకటించారు.

ఈ ఆర్థిక సాయాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థిని కుటుంబసభ్యులకు అందజేస్తామని ట్రస్ట్‌ చైర్మన్‌ ప్రసన్నకుమార్‌రెడ్డి, ట్రస్ట్‌ కోశాధికారి, ఎమ్మెల్యే తనయుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడారు. చదువుల్లో టాపరైన విద్యారి్థని తన ప్రతిభతో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి చురుకైన విద్యార్థినికి బ్లడ్‌ కేన్సర్‌ రావడం దురదృష్టకరమని తెలిపారు. ఈ క్రమంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సాయం చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. అనంతరం రజత్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. విద్యార్థిని మాధురి వ్యాధి నుంచి కోలుకొని సమాజానికి ఉపయోగపడేలా భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు.

మాధురి పరిస్థితిపై ఆరోగ్యశ్రీ అధికారుల ఆరా 
కాకర్ల మాధురి కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేరింది. ఈ క్రమంలో అమరావతిలోని సీఎం కార్యాలయం నుంచి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు సదరు కార్పొరేట్‌ ఆస్పత్రి వర్గాలతో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. ఓ పోలీస్‌ అ«ధికారి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. మాధురి చదువుతున్న డిగ్రీ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యారి్థని నివాసం ఉండే ముసునూరుకు చెందిన స్థానికులు ఆర్థిక సాయాన్ని అందజేశారు.

మరిన్ని వార్తలు