కష్టంలో ఉన్న వారే నా ఆత్మ బంధువులు: రాచమల్లు

17 Nov, 2019 07:30 IST|Sakshi
షబానా కుమారుడు అభిరాం ప్రసాద్‌కు రూ.10.33 లక్షల ఎల్‌ఐసీ బాండును అందిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

సాక్షి, ప్రొద్దుటూరు : కష్టంలో ఉన్నవారే నా ఆత్మ బంధువులని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. పేదల ప్రేమతోనే నా రాజకీయ జీవితం ఆరంభమైందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తీట్ల రాజేష్‌ కుమారుడు అభిరాం ప్రసాద్‌కు రూ.10.33లక్షల విలువైన ఎల్‌ఐసీ బాండును శనివారం తన కార్యాలయంలో అందించారు. అభిరాంప్రసాద్‌ యుక్త వయసు నాటికి ఈ డబ్బు అందనుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడారు. ఈ ఏడాది జూలై నెలలో పులివెందులకు ద్విచక్రవాహనంలో వెళుతూ తీట్ల రాజేష్‌తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూలి పనులు చేసుకునే వారి కుటుంబాల గాథను విన్న వెంటనే ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, తాను స్పందించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా మూడు కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున రూ.15లక్షలు చెక్కును మంజూరు చేయించామన్నారు.

ఆ సమయంలో తీట్ల రాజేష్‌ సతీమణి షబానా నిండు గర్భిణిగా ఉండటాన్ని చూసి తాను చలించి పోయానన్నారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని అక్కడే తెలిపామన్నారు. పురిటినొప్పులతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేరి్పంచి వైద్య సాయం కూడా అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 26న షబానా రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చిందన్నారు. తానే ఆ బిడ్డకు అభిరాం అని పేరు పెట్టగా షబానా కుటుంబీకులు తనపై ఉన్న మమకారంతో అభిరాంప్రసాద్‌గా పేరు మార్చుకున్నారన్నారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ద్వారా సేవా గుణం అలవర్చుకున్నా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ద్వారా తాను సేవా గుణాన్ని అలవర్చుకున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయాన్ని బోధించానన్నారు. పేదల ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల నూనెలో పడిన బాలుడు భువనేశ్వర్‌కు వైద్య సాయం అందిస్తున్నానని చెప్పారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి లాలసకు ఆర్థిక సహాయం చేశానన్నారు. కశెట్టి చిన్న వెంకటసుబ్బయ్య ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ల సారాంశం సేవా మార్గమేనన్నారు.

టీడీపీ నేతలు కూడా ఇదే మార్గాన్ని అలవర్చుకోవాలని, ఇతరులపై విమర్శలను మానుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు చౌడూరు బోరెడ్డి, మహిళా విభాగం కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మాజీ కౌన్సిలర్లు రాగుల శాంతి, గరిశపాటి లక్ష్మీదేవి, టప్పా గైబుసాహెబ్, రఫిక్, పోసా భాస్కర్, జంబాపురం రామాంజనేయరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దూరి దేవి, గుమ్మళ్ల పద్మావతి, బోగాల లక్ష్మీనారాయణమ్మ, నరాల మల్లికార్జునరెడ్డి, శంకరాపురం నాగమునిరెడ్డి, ఆర్సీ సుబ్రహ్మణ్యం, బలిమిడి చిన్నరాజు, ఫయాజ్, 24వ వార్డు ఇన్‌చార్జి రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు